Vijay emotional comments: సినిమాలు ,రాజకీయాలు రెండు వేర్వేరు ప్రపంచాలు. ముఖ్యంగా సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కచ్చితంగా సినిమాలను వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండిటిని బ్యాలన్స్ చేయడం అసాధ్యం. గతంలో సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి మాత్రమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడైతే ఆయన ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి, ఆయన సినిమాలకు ఎలాంటి సమస్యలు రావు. కానీ 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందో మనమంతా చూసాము. ఇప్పుడు తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈమధ్య కాలం లోనే ఆయన TVK అనే పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
DMK పార్టీ పై, అదే విధంగా కేంద్రం లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పై ఆయన ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. ఈ క్రమం లోనే జనవరి 9న ఆయన హీరోగా నటించిన ‘జన నాయగన్ ‘ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. విడుదల అవ్వాల్సిన సినిమా ఆగిపోయింది. నిర్మాతకు వ్యాపారం లో కోట్ల రూపాయిల నష్టాలు. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని దయనీయమైన పరిస్థితి ఈ చిత్రానికి ఏర్పడింది. చివరిసారిగా తమ అభిమాన హీరో ని వెండితెర పై చూసుకుందామని ఆశగా ఎదురు చూసిన ఆయన అభిమానుల బాధ వర్ణనాతీతం. అయితే రీసెంట్ గానే విజయ్ ఒక నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలి అనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తే, నా సినిమా నిర్మాతలను ఇబ్బంది పెడుతారు. అందుకే సినిమాలకు దూరమైతే, అలాంటివి ఏమి చెయ్యలేరు కాబట్టి, ధైర్యం గా రాజకీయాల్లో ఎంత దూరమైనా వెళ్లొచ్చు అనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు దూరం అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు నా ‘జన నాయగన్’ చిత్రానికి ఎదురు అవుతున్న సమస్యలు మీరంతా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయని ముందే ఊహించాను. ఇప్పుడు నా నిర్మాతలను చూస్తుంటే చాలా బాధ వేస్తోంది’ అంటూ విజయ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.