Vijay Devarakonda Liger: దేశాన్ని షేక్ చేస్తామని విడుదలకు ముందు చెప్పారు. కానీ తీరా విడుదలయ్యాక ప్రేక్షకులు షేక్ అయ్యే తీర్పు ఇచ్చారు. దెబ్బకు విజయ్ దేవరకొండకు తత్వం బోధపడింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ శివానిర్వాణ తీసే ఖుషి మీదే. లైగర్ పరాజయం నేపథ్యంలో సినిమా నిర్మాత పూరి జగన్నాథ్ చాలా చిక్కులోనే పడ్డాడు. ఇప్పటికీ ఆ ఎగ్జిబిటర్ల గొడవ సమస్య పోలేదు. ఆ విషయం పక్కన పెడితే లైగర్ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ కొంతమంది పాత్రికేయులతో మాట్లాడాడు.
-చాలా ఇబ్బంది పడ్డాడట
లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు. అతడు పడ్డ కష్టం ఆ సినిమాలో కనిపించింది. కానీ దానికి తగ్గట్టుగా ఫలితం దక్కలేదు. ” కొన్నిసార్లు తప్పులు చేస్తాం. కొన్నిసార్లు ఒప్పులు చేస్తాం. ఎవరైనా తప్పులు చేయడం లేదంటే వారి జీవితంలో దేనికోసం గట్టిగా ప్రయత్నించడం లేదని అర్థం. నాకు వచ్చిన విద్యతో నా కంఫర్ట్ జోన్ లో ఎంత చేసినా అందులో పస ఉండదు. అంటే నేను ముందుకు వెళ్లడం లేదని అర్థం. ఎదగాలి అంటే కొత్త ప్రయత్నం చేయాలి. ఇంకా కృషి చేయాలి. గొప్ప పనులు చేయాలనే కోరిక కూడా ఉండాలి.. కొన్నిసార్లు మన ప్రయత్నం ఫలించదు. కానీ ఆ ప్రయత్నం చేయడం ముఖ్యం. విజయం దక్కినా, దక్కకపోయినా విజయ్ దేవరకొండ ఎవరు? అతడి స్థాయి ఏమిటి? అతడికి ఏం కావాలి? అతను ఏం చేయగలుగుతాడు? అనే అవగాహన నాకు ఉంటే చాలు” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ఇక లైగర్ సినిమా షూటింగ్ విషయంలో ప్రతిక్షణాన్ని విజయ్ దేవరకొండ ఆస్వాదిస్తూ పని చేశాడు. ఆ క్రమంలో వ్యక్తిగతంగా అతనిలో చాలా సానుకూల మార్పులు వచ్చాయి. గతంలో అతడి శరీరం అంత దృఢంగా ఉండేది కాదు. కానీ లైగర్ సినిమా కోసం అతడు చేసిన వర్కౌట్స్ వల్ల శరీరం చాలా ఫిట్ గా మారింది. ఇక ఆ సినిమాలో అతడు నత్తితో మాట్లాడుతాడు. తీవ్రంగా సాధన చేసి అతడు ఆ విధంగా మాట్లాడాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి అతడు చేసిన ప్రచారం ఓవర్ గా అనిపించినా ఇండియా మొత్తం తీసుకెళ్లేందుకు ఉపయోగపడింది. ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అని విజయ్ వివరించాడు.
-భయపడడం బలహీనత కాదు
విజయ్ కి చిన్నప్పటి నుంచి స్టేజి ఫియర్ ఉండేది.. స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయాలంటే ఇబ్బంది పడేవాడు. కానీ గొప్పగా చేయాలనే ఆలోచన ఆ భయాన్ని మించినది అయినప్పుడు.. ఆ భయం పోతుంది. తొలిసారి ఎవరైనా భయపడతారు. కానీ పదే పదే ఒక పని చేస్తుంటే పరిణితి వస్తుంది. భయం పోతుంది. ఇలా చేయడం వల్లే విజయ్ తన స్టేజ్ ఫియర్ ని పోగొట్టుకున్నాడు. ఇక మొదటి నుంచి విరామం లేకుండా కష్టపడటం విజయ్ కి అలవాటు.. పనిలో వెనుకడుగు అనేది అతనికి ఇష్టం ఉండదు. కానీ లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత ఒక అడుగు వెనక వేయడం అలవాటు చేసుకున్నాడు. తనను తాను నిరూపించుకునేందుకు తపన పడుతున్నాడు. మరింత గౌరవం పొందాలని ఆరాటపడుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ హిప్ హాప్ మ్యూజిక్ ని ఇష్టపడతాడు. కాలేజీ రోజుల నుంచే అతడికి ఈ ఇష్టం మొదలైంది. ఇక జిమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యూజిక్ సిస్టంను తన చేతిలోకి తీసుకుంటాడు. తనకు నచ్చిన సంగీతాన్ని పెట్టుకొని ఆస్వాదిస్తూ ఉంటాడు.. ఎక్కడ వినిపించే సంగీతాన్ని బట్టి విజయ్ జిమ్ లో ఉన్నాడో లేదో మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రస్తుతం శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. మరి కొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ మార్కెట్ కొంచెం డౌన్ అయింది. ఈ నేపథ్యంలో తన పారితోషికాన్ని కూడా తగ్గించినట్టు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా రష్మిక తో డేటింగ్ చేస్తున్న విజయ్.. ఈ మధ్య సమంతకు దగ్గర గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనికి విజయ్ ఏం చెప్తాడో వేచి చూడాల్సి ఉంది.