Venkatesh: దాదాపుగా రెండు దశాబ్దాల నుండి సోలో హీరో గా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న విక్టరీ వెంకటేష్, ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ద్వారా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడో మనమంతా చూసాము. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. వెంకటేష్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ క్రౌడ్ పుల్ ఉంటుందో ఈ చిత్రం ద్వారా నిరూపితమైంది. విడుదలై మూడు వారాలు కావొస్తుంది. ఈ మూడు వారాల్లో ఈ చిత్రానికి దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పాన్ ఇండియన్ సినిమాలకు వచ్చే వసూళ్లు, ఒక మామూలు కమర్షియల్ హిట్ కి వచ్చాయంటే వెంకటేష్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అయితే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత వెంకటేష్ చేయబోతున్న సినిమా ఏమిటి అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ గానే ఆయనతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ‘పుష్ప 2 ‘ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ నిర్మాతలు ఇప్పుడు వెంకటేష్ తో చేతులు కలపడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో కమర్షియల్ గా ఈ డైరెక్టర్ కళ్ళు చెదిరే కమర్షియల్ హిట్స్ ని అందుకున్నాడు. ‘లక్కీ భాస్కర్’ చిత్రం అయితే ఒక ప్రభంజనం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో అయితే గత రెండు నెలలుగా నాన్ స్టాప్ ట్రెండ్ అవుతుంది.
ఈ చిత్రం తర్వాత ఆయన తమిళ హీరో సూర్య తో చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ, వెంకటేష్ తో తన ప్రాజెక్ట్ ని లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వెంకటేష్ వయస్సుకి తగ్గ పాత్ర ని ఆయన డిజైన్ చేసినట్టు సమాచారం. వెంకీ అట్లూరి సినిమాలు మన సమాజం లో మన చుట్టూ ఉండే అంశాలను టచ్ చేస్తూ ఉంటాయి. అవి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో కమర్షియల్ గా ఆ చిత్రాలు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ లు అవ్వడం మనమంతా చూసాము. వెంకటేష్ తో చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందట. కథ చాలా అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా కూడా వెంకటేష్ కి కమర్షియల్ గా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.