Venu Swamy: ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. వైసీపీ పార్టీని ఎలాగైనా ఓడించాలని కూటమి నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరుపున సినీ సెలబ్రెటీలు, టీవీ ఆర్టిస్టులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగింది. వరుణ్, సాయి ధరమ్, వైష్ణవ్ నేరుగా ప్రచారం చేశారు. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వీడియో విడుదల చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వేణు స్వామి పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో దారుణంగా మోసపోవడం ఖాయం అని వేణు స్వామి అంచనా వేస్తున్నాడు.వేణు స్వామి మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాలేడు. ఎందుకంటే అతని జాతకంలో ఆ యోగమే లేదు. ఇప్పుడే కాదు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం జరగదు అని వేణు స్వామి అన్నాడు.
పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు చేతిలో మోసపోతారు. గ్రహాల రీత్యా వీళ్ళిద్దరివి ప్రతికూల ప్రభావం ఉన్న నక్షత్రాలు. చంద్రబాబుది పుష్యమి నక్షత్రం. పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి. ఈ రెండింటికి అసలు పొత్తు కుదరదు. అందుకే వీరిద్దరి జాతక ప్రభావ రీత్యా పొత్తు కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. వాళ్ళ నక్షత్రాల ప్రభావం వాళ్ల కూటమి పై కూడా పడుతుంది. అందుకే వీళ్ళకి ఓటు బదిలీ జరగదు.
ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఓడిపోతుంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుంది. నాకు పవన్ తో ఎలాంటి గొడవలు లేవు జాతకం ప్రకారమే చెప్తున్నా అని వేణు స్వామి వెల్లడించారు. వేణు స్వామి కామెంట్స్ మరింత హాట్ గా మారాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ వేణు స్వామి పై మండి పడుతున్నారు. డబ్బులకు అమ్ముడుపోయిన వేణు స్వామి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు.