Allu Arjun and Sukumar : సోషల్ మీడియా లో నిత్యం స్టార్ సెలెబ్రిటీల పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ నెటిజెన్స్ చేత చివాట్లు పెట్టించుకుని జ్యోతిష్యులలో ఒకరు వేణు స్వామి. ఈయనేమి జ్యోతిష్కుడో ఎవరికీ అర్థం కాదు. ఇతను అందరి బ్రాహ్మణులు ఆచరించే పద్దతులను అనుసరించడు. మందు తాగుతాడు, మాంసం తింటాడు, ఇవన్నీ సరిపోవు అన్నట్టు హైదరాబాద్ లో ఇతనికి పబ్బులు కూడా ఉన్నాయి. ఎదో సమంత, నాగ చైతన్య వ్యవహారంలో ఇతను చెప్పిన మాటలు నిజమయ్యాయి అనే విషయాన్ని పట్టుకొని, సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంట కనిపిస్తే చాలు, వీళ్లిద్దరు విడిపోతారు అని అశుభం పలుకుతాడు. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజు, వాళ్లిద్దరూ 2028 వ సంవత్సరం లో విడిపోతారంటూ కారుకూతలు కూశాడు. దీనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి చాలా తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది.
సినీ ఇండస్ట్రీ జర్నలిస్టుల సంఘం మహిళా కమీషన్ కి ఇతనిపై ఫిర్యాదు కూడా చేశారు. మహిళా కమిషన్ తమ వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరగా, వాళ్ళ నోటీసులను వ్యతిరేకిస్తూ ఈయన హై కోర్టు లో పిటీషన్ వేసాడు. హై కోర్టు ఆ పిటీషన్ ని కొట్టి పారేస్తూ, మహిళా కమీషన్ కి వేణు స్వామిపై చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా అధికారం ఉందని చెప్పుకొచ్చింది. దీంతో మొన్ననే వేణు స్వామి మహిళా కమీషన్ వద్దకు వెళ్లి తానూ నాగ చైతన్య, శోభితలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . మహిళా కమీషన్ కూడా ఇంకెప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయకు అంటూ వేణు స్వామి ని హెచ్చరించి పంపింది. పోనిలే వేణు స్వామి కి ఇప్పటికైనా బుద్దొచ్చింది అని అంతా అనుకున్నారు. కానీ అంత తేలికగా ఆయన మారిపోతే వేణు స్వామి ఎందుకు అవుతాడు?, మరుసటి రోజే మళ్ళీ అల్లు అర్జున్, సుకుమార్ లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ కన్యారాశి కి చెందిన వాడు, అదే విధంగా సుకుమార్ ది కుంభ రాశి. వాళ్ళ జాతకాలు పస్టష్టకం కాంబినేషన్ లో ఉండగా, శని స్థానం ని బట్టి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల గత సంవత్సరం నుండి ఆయనపై శత్రువుల నుండి విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. వీటి వల్ల ఆయన జైలుకు వెళ్లే దుస్థితి కూడా వచ్చింది. ఈ సంఘటన ఆయన్ని మానసికంగా బాగా దెబ్బ తీసింది. మార్చి 30 వరకు వీళ్లిద్దరి జాతకాలు ఇలాగే ఉంటాయి. ఆ తర్వాత నుండి మాత్రం వీళ్ళు మరింత ఎత్తుకు ఎదుగుతారు.’ అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న వ్యహారాలను చూసి చిన్న పిల్లవాడు కూడా ఇలాంటి జాతకాలు చెప్పగలరు. ఎన్ని తిట్లు తిన్నా కూడా వేణు స్వామి తన అటెన్షన్ సీకింగ్ బుద్ధులను మానుకోవడం లేదని అంటున్నారు నెటిజెన్స్.