Venkatesh: ఆ విషయంలో చిరంజీవి, బాలయ్య, నాగ్ లకు ఝలక్ ఇచ్చిన వెంకీ, అరుదైన రికార్డు సొంతం!

తన తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు ఝలక్ ఇస్తూ వెంకటేష్ ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆ ముగ్గురిపై పైచేయి సాధించాడు. ఆ రికార్డు ఏమిటో తెలుసా?

Written By: S Reddy, Updated On : November 1, 2024 5:14 pm

Venkatesh

Follow us on

Venkatesh: ప్రతి హీరోకి 50వ చిత్రం ఒక మైలురాయి. ఈ జనరేషన్ హీరోలు ఈ ఫీట్ చేరుకోవడం కష్టమే. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక నటులు రెండు మూడేళ్లకు ఒక చిత్రం చేస్తున్నారు. గత ఆరేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ రెండు చిత్రాలు మాత్రమే చేశాడు. రాజమౌళితో మూవీ అంటే కనీసం మూడేళ్ళ సమయం కేటాయించాలి. మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29కి రాజమౌళి దర్శకుడు. ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేం.

అయితే ఒకప్పటి హీరోలు ఏడాదికి పదుల సంఖ్యలో చిత్రాలు చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ 1973లో ఏకంగా 18 సినిమాలు విడుదల చేసి రికార్డు నెలకొల్పాడు. గతంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సైతం ఏడాదికి ఐదారు చిత్రాలు విడుదల చేసేవారు. ప్రస్తుతం వారి నుండి ఒకటి రెండు రావడం గగనమైపోతుంది. అయితే 50 చిత్రాలు ఈ నలుగురు హీరోలు చకచకా పూర్తి చేశారు. చిరంజీవి అయితే సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మొదటి ఐదేళ్లలోనే 50 చిత్రాలు పూర్తి చేశాడు.

కాగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ నటించిన 50వ చిత్రం ఏమిటీ? దాని ఫలితం ఏమిటో తెలుసా? 50వ చిత్రం అంటే నటులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. 50వ చిత్రంతో భారీ హిట్ ఇవ్వాలని అనుకుంటారు. అది అందరికీ సాధ్యం కాదు. చిరంజీవి 50వ చిత్రం ప్రేమ పిచ్చోళ్ళు. ఈ మూవీకి ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. చిరంజీవికి జంటగా రాధిక నటించింది. ఈ మూవీ అంతగా ఆడలేదు. అదే ఏడాది ఏ.కోదండరామిరెడ్డి చిరంజీవికి ఖైదీ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు.

బాలకృష్ణ 50వ చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రానికి కూడా ఏ. కోదండరామిరెడ్డి దర్శకుడు. శోభన, నిరోషా హీరోయిన్స్ గా నటించారు. కేవీ మహదేవన్ సంగీతం అందించారు. నారీ నారీ నడుమ మురారి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలోని పాటలు ఆల్ టైం మ్యూజిక్ లవర్స్ కి ఫెవరేట్ అని చెప్పొచ్చు. శారద, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య కీలక రోల్స్ చేశారు.

ఇక నాగార్జున 50వ చిత్రం ఆకాశవీధిలో. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఆకాశవీధిలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. రామోజీ రావు నిర్మించిన ఈ చిత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. అంజలా జవేరి, రవీనా టాండన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంలో పాటలు బాగుంటాయి. కాగా వెంకటేష్ 50వ చిత్రం నువ్వు నాకు నచ్చావ్. దర్శకుడు కే. విజయభాస్కర్ తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు, కథ అందించారు. నువ్వు నాకు నచ్చావ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వెంకటేష్ కెరీర్లో అతి పెద్ద విజయం నమోదు చేసింది.

50వ చిత్రం విషయంలో చిరంజీవికి ప్లాప్ పడింది. నాగార్జునకు యావరేజ్ దక్కింది. బాలకృష్ణకు హిట్ పడింది. వెంకటేష్ మాత్రం బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఆ ముగ్గురిపై వెంకటేష్ ది పైచేయి అయ్యింది.