
‘వకీల్ సాబ్’ విడుదలకు ఇంకా పదిరోజుల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. మూడేళ్ల తర్వాత తెరపై తమ అభిమాన హీరోను చూసుకోబోతున్నామన్న ఆనందం వారిని నిలవనీయడం లేదు. ఇక, ఇవాళ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుండడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
దీంతో ట్విట్టర్ లో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. #VakeelSaabTrailerDay అంటూ ట్వీట్లు, రీ-ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఊపేసింది. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ చిత్రం పింక్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. న్యాయం కోసం పోరాడే ముగ్గురు యువతుల కథ. ఈ సినిమాలో ఒరిజినల్ వెర్షన్ హిందీలో లాయర్ పాత్ర బిగ్ బీ అమితాబ్ పోషించారు. అదే పాత్రను పవన్ కల్యాణ్ టేకప్ చేశారు. అయితే.. పవన్ ఈ సినిమాలో నటించాల్సి రావడంతో కమర్షియల్ అంశాలు కంపల్సరీ అయ్యాయి. పవన్ ఇమేజ్, అభిమానులు ఆశించే అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టులో మార్పులు చేశారట దర్శకుడు. దీంతో అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది.
దీంతో.. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడుతున్నారు ఫ్యాన్స్. దీంతో బెనిఫిట్ షోల టిక్కెట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారట. రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే.. విశాఖలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారట.
వీటికి గానూ టికెట్ కు ఏకంగా రూ.1500 నిర్ణయించినట్టు సమాచారం. తెల్లవారు జామున వేసే షోలకు రూ.500 రేటు నిర్ణయించినట్టు సమాచారం. ఆ తర్వాత నుంచి మొదలయ్యే రెగ్యులర్ షోలకు రూ.200 రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తొలి వారం మొత్తం ఈ రేటు కొనసాగుతుందని తెలుస్తోంది. అయినప్పటికీ.. టికెట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
మార్చి 29న వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నామని మేకర్స్ ఈ మధ్యనే ప్రకటించారు. ఆ మాట ప్రకారమే.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు టీజర్ గాల్లో ఎగరనుంది. దాన్ని క్యాచ్ చేసేందుకు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే హైట్స్ లో ఉన్న వకీల్ సాబ్ మేనియా.. ట్రైలర్ విడుదల తర్వాత పీక్స్ కు చేరేలా కనిపిస్తోంది.