
థియేటర్లలో వకీల్ సాబ్ సందడి చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమేమిగిలి ఉంది. కానీ.. బెనిఫిట్ షోల సంగతి ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సహజంగా బెనిఫిట్ షోలకు పర్మిషన్ అడగ్గానే ప్రభుత్వాలు ఇచ్చేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితి వేరు. సెకండ్ వేవ్ దూసుకొస్తున్న ఈ పరిస్థితుల్లో అదనపు షోలకు అవకాశం లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదుగానీ.. నో చెబితే పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న.
పవన్ కల్యాణ్ సినిమా అంటే.. సాధారణ సమయాల్లోనే రచ్చ చేస్తారు ఫ్యాన్స్. అలాంటిది.. మూడేళ్ల తర్వాత వస్తుండడంతో.. వారి ఆనందానికి హద్దే లేకుండాపోయింది. దీంతో.. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీస్థాయిలో జరిగింది. దాదాపు వంద కోట్ల మేర వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని వెనక్కి రాబట్టడంలో సినిమా హిట్ షేర్ కంపల్సరీ. అయితే.. దానికన్నా ముందుగానే బెనిఫిట్ షోలతో సాధ్యమైనంత కలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్.
ఇందులో భాగంగానే.. అదనపు షోలకు ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. విశాఖ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలను ప్లాన్ చేశారు. కానీ.. కొవిడ్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశంలో లక్షకుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు షోలకు అవకాశం ఇవ్వడమంటే.. కొవిడ్ ను పెంచడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా ప్రధాని ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో కొవిడ్ గురించి కీలకంగా చర్చించారు. కరోనా వేగం చూస్తుంటే.. మళ్లీ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీకి పడిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. దేశంలో కొన్నిచోట్ల మూసేస్తున్నారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. బెనిఫిట్ షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంత మేరకు అనుమతి ఇస్తాయన్నదే ఆసక్తికరం.
ఒకవేళ నోచెబితే మేకర్స్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. వందకోట్ల బ్రేక్ ఈవెన్ తో రంగంలోకి దిగడం చిన్న విషయం కాదు. పవన్ క్రేజ్ తో వసూలు చేసే అవకాశాలున్నా.. కరోనా అడ్డుగా ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పరిస్థితులతో సంబంధం లేకుండా వందకోట్లు కలెక్ట్ చేయడం మాత్రం తప్పక అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా మొత్తాన్ని పవన్ తన భుజస్కంధాలపైనే మోయాల్సి ఉంటుంది. ఈ కండీషన్లోనూ వంద కోట్ల మార్క్ ను రీచ్ అయ్యాడంటే.. పవర్ స్టార్ స్టామినాకు తిరుగులేదని సంతకం చేసేయొచ్చు.