అంత గొప్పగా ఆయన రాస్తారు. ఒదుగు, ఒడుపు, జిగి జిలుగులతో కలిసిపోయిన పదాలు ఆయన చేతి వేళ్ళ మధ్యలో నాట్యం ఆడతాయి. ముఖ్యంగా మనిషి, మనసు, మమత, దేవుడు, విధి మీద రకరకాల ప్రయోగాలతో ఆత్రేయ రాసినన్ని పాటలు మరొకరు రాయలేదు. మొత్తమ్మీద మాటలనే పాటలుగా మలిచిన ఆచార్యుడిగా ఆత్రేయ సాధించిన రికార్డులు మరొకరికి సాధ్యం కావు.
ముఖ్యంగా ఆయన పొడి పొడి మాటలతో పాట రాస్తాడు. అవి కాస్తా మన ‘మనసు‘ను తడిపి ముద్ద చేస్తాయి. పైగా ఆయన అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేట్లు పాట రాయడం ఆయన ప్రత్యేకత. ఇక నెల్లూరు జిల్లా, సూళ్ళూరు పేట తాలూకా, మంగళం పాడుకు సమీపంలోని ‘ ఉచ్చూరు‘ అనే చిన్న గ్రామంలో 1921లో జన్మించారు ఆత్రేయ.
ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. మరి ఆత్రేయ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటే.. అది ఆయన గోత్రనామం అట. నాటక రచయితగా వున్న ఆత్రేయ, కడుపు నింపుకోవడం కోసం పాటల రచయితగా మారాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినిమా పాటలలో “ఆత్రేయ” రాగంలా వెలుగొంది మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మొత్తం ఆయన 1400 పాటలు రాశారు.
భావం ఎంత బరువైనా తేలికైన మాటలతో మనసును బరువెక్కించేవారు ఆయన. అలా ఆయన తెలుగు సినిమా పాటకు “మనసు కవిగా“ మారారు మన ‘సుకవి ఆత్రేయ. పాటలు ‘ రాయక ‘ నిర్మాతల్ని ’ రాసి ‘ ప్రేక్షకుల్ని ఏడ్పించే వారన్న అపప్రథ వున్నా, ఆయన తమ సినిమాకు పాటలు రాయడాన్ని పెద్ద ప్రివిలేజ్ గా భావించేవారు నిర్మాతలు. ఆ పాటలు విని’మనసారా’ ఏడ్చి ఆనందించేవారు ప్రేక్షక జనం .ఏమైనా ఆత్రేయ గొప్ప రచయిత.