హీరోల బర్త్ డే సందర్భంగా.. అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక లుక్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడం అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. రాజమౌళి కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. RRR సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు, అప్డేట్లు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్ లుక్ ను రిలీజ్ చేశాడు. అయితే.. తాము ఎంతగానో ఎదురు చూస్తే.. జక్కన్న ఇలాంటి పోస్టర్ ఇచ్చాడేంటని తెగ డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్.
RRR సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు సగటు ప్రేక్షకులు. ఇక, ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమరం భీమ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ చేశాడు జక్కన్న. రామ్ ఫర్ భీమ్ జూనియర్ టీజర్.. భీమ్ ఫర్ రామ్ అంటూ చెర్రీ టీజర్ వదిలాడు. ఈ రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత.. సీత లుక్ ను వదిలాడు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రామరాజు లుక్ ను సైతం విడుదల చేశాడు. ఇవన్నీ ఆకట్టుకున్నాయి.
కానీ.. జూనియర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన భీమ్ పోస్టర్ మాత్రం చాలా మందిని నిరాశకు గురిచేసింది. వాళ్లు పెట్టుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయింది. ఇది చూసి చాలా మంది ఎవరో అభిమాని రూపొందించిన ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ లా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. రాజమౌళి నుంచి వచ్చిన పోస్టర్ ఇలా ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు.
వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా నుంచి ఇలాంటి పోస్టర్ రావడమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ ఉక్రోషం ఆపుకోలేక సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి పోస్టర్ ను ఫొటో షాప్ లో మేము ఇంకా మంచిగా డిజైన్ చేసుకోగలమని అంటున్నారు. మొత్తానికి జూనియర్ బర్త్ డేవేళ అభిమానులను జక్కన్న నిరాశపరిచారని అంటున్నారు. మరి, దీనికి రాజమౌళి ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.