Trivikram Srinivas: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లోని మనకి వినపడే డైలాగ్స్ ని చూస్తే ఆయన ఏ స్థాయి పండితుడో అర్థం అవుతుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ ని సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే. వైజాగ్ లోని మన ఆంధ్ర యూనివర్సిటీ లోనే ఆయన ఈ గోల్డ్ మెడల్ ని అందుకున్నాడు. అయితే నేటితో ఆంధ్రా యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. ఈ సెలెబ్రేషన్స్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ వంటి వారితో పాటు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి .
ఆయన మాట్లాడుతూ ‘ఇంత మంది పెద్దల ముందు మాట్లాడాలంటే నా కాళ్ళు వణుకుతున్నాయి. ఇక్కడ మాట్లాడేంత అర్హత నాకు లేదు , కానీ ఇక్కడే చదువుకున్న ఒక సాధారణ విద్యార్థిగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. విభిన్నమైన ఆలోచనలు , దృక్పధాలు అన్నీ ఒక చోట కలిస్తే ఎలా ఉంటుందో , అదే ఈ యూనివర్సిటీ. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది మేధావులు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు. విద్యార్థులకు నేను చెప్పేది ఏమిటంటే, కేవలం మనకి తెలిసిన విషయాలే గొప్పవి అని నమ్మడం లో ఎలాంటి అర్థం లేదు. పది మందితో కూర్చొని చర్చించుకున్నపుడే అన్ని విషయాలు అర్థం అవుతాయి. నేను ఇక్కడ ఫిజిక్స్ చదువుకోవడానికి వచ్చి సాహిత్యం వైపు అడుగులు వేసాను. ఆంధ్ర యూనివర్సిటీ నాతో పాటు ఎంతో మందికి చోదక శక్తి లాగా నిల్చింది’ అంటూ తన మార్క్ స్పీచ్ ఇవ్వడం తో , ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ , ఈ సినిమా పూర్తి అవ్వగానే ఎన్టీఆర్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రం చేయబోతున్నాడు.
