Trivikram- Allu Arjun: అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఆయన పాన్ ఇండియా హీరో. ఇకపై ఆయన నుండి వచ్చే చిత్రాలన్నీ భారీ స్థాయిలో ఉండనున్నాయి. పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ ఎవరితో మూవీ చేస్తారనే ఓ సందిగ్ధత ఉంది. గతంలో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్, కొరటాల శివతో చిత్రాలు ప్రకటించారు. అవి కార్యరూపం దాల్చలేదు. కొరటాల శివ అల్లు అర్జున్ తో అనుకున్న కథను ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు సమాచారం. ఇక ఐకాన్ టైటిల్ తో వేణు శ్రీరామ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ అలానే ఉంది.
అల్లు అర్జున్ డేట్స్ ఇస్తే దిల్ రాజు నిర్మించాలని రెడీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ తనకు అచొచ్చిన దర్శకుడికే మరలా ఛాన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ప్రకటనలో కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈసారి భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాం, ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పకనే చెప్పారు. గతంలో త్రివిక్రమ్ పాన్ ఇండియా చిత్రం చేయలేదు ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం కూడా ఓన్లీ తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది.
త్రివిక్రమ్ కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో అచ్చతెలుగు నేటివిటీతో సాగుతాయి. అందుకే త్రివిక్రమ్ చిత్రాలకు ఇతర భాషల్లో మార్కెట్ ఉండదు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో రీమేక్స్ దారుణ పరాజయం చూశాయి. కాబట్టి అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ యూనివర్సల్ సబ్జెక్ట్ సిద్ధం చేశారా? లేదా ఎప్పటిలానే ఫ్యామిలీ డ్రామా తీస్తాడా? అనే సందేహాలు ఉన్నాయి.
అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ ఈసారి తన శైలికి భిన్నమైన సబ్జెక్టు ఎంచుకున్నారట. త్రివిక్రమ్ మహాభారతం స్ఫూర్తిగా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ముఖ్యంగా రెండు పర్వాలను ఎంచుకుని వాటి ఆధారంగా మూవీ తెరకెక్కించనున్నారట. కాబట్టి అల్లు అర్జున్ పాత్రకు సమానమైన, బలమైన మరికొన్ని పాత్రలు చిత్రంలో ఉంటాయట. అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్లు మోడ్రన్ మహాభారతంగా వీరి చిత్రం ఉంటుందంటున్నాను. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.