Vivekam: జగన్ పైనే దారుణం.. ‘వివేకం’ సినిమా డైరెక్టర్ బతికి బట్టగలడా?

గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అసలు లక్ష్యం వేరే ఉన్నప్పటికీ... సినిమా మేకర్స్ ఆ విషయాన్ని నేరుగా చెప్పలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 28, 2024 3:49 pm

Vivekam

Follow us on

Vivekam: తెలుగు నాట రాజకీయాలు, సినిమాలను వేరువేరుగా చూసే పరిస్థితి ఉండదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు సినిమాలు కవల్లలాగా కలిసిపోయాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి నెలకొంది. తెలుగు నాట మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో రాజకీయాలు సినిమాలు మరింతగా కలిసిపోయాయి. ఇందులో రాజకీయ పరమార్ధం ఎక్కువగా ఉండటంతో సినిమాల అసలు లక్ష్యం మారిపోతోంది.

గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను బాలకృష్ణ హీరోగా తెరకెక్కించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అసలు లక్ష్యం వేరే ఉన్నప్పటికీ… సినిమా మేకర్స్ ఆ విషయాన్ని నేరుగా చెప్పలేదు. చక్కెర పూసిన మాత్రలాగా జనం మీదకి వదిలారు. ఫలితం చేదు గుళికను మిగిల్చింది. అప్పటి అధికార పార్టీ నాయకులు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. టిడిపి నాయకులకు కౌంటర్ గా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను రూపొందించారు. దానిని విడుదల చేశారు కూడా. అయితే ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ.. అప్పట్లో వర్మ లక్ష్యం నెరవేరింది. అప్పట్లోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టమైన పాదయాత్రను ఉద్దేశించి మహి వి రాఘవ్ యాత్ర అనే సినిమా రూపొందించారు. అది సూపర్ సక్సెస్ అయింది. వైసిపి అధికారంలోకి రావడానికి ఆ సినిమా కూడా ఎంతో కొంత ముఖ్యపాత్ర పోషించింది. గత ఎన్నికల్లో సినిమాలు వైసిపికి లాభం చేకూర్చిన నేపథ్యంలో.. ఈసారి ఎన్నికల్లో కూడా రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా కొన్ని సినిమాలు రూపొందాయి.

ఈ సినిమాల్లో వర్మ వ్యూహం బెడిసి కొట్టగా.. రాఘవ్ యాత్ర-2 అంతంత మాత్రం గానే ఆడింది. ఇక యాత్రకు కౌంటర్ గా ఓ దర్శకుడు వివేకం అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన నేపథ్యాన్ని ప్రధాన కథా వస్తువుగా మలిచి రూపొందించాడు. ఈ సినిమాలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అందులో ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించడం పట్ల ప్రజల నుంచి ముఖ్యంగా వైసీపీ నాయకులనుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను ఎందుకు బయటకు లాగుతారనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే వివేకం సినిమా దర్శకుడు బతికి బట్ట కడతాడా అని వైసిపి నాయకులు చర్చించుకుంటున్నారు.