Ranveer Singh Dhurandhar Craze: బాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రణవీర్ సింగ్(Ranveer Singh). ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రణవీర్ సింగ్, తన సొంత టాలెంట్ మీద నేడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. రీసెంట్ గానే ఆయన ‘ధురంధర్’ చిత్రం తో ఎలాంటి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ చిత్రం విడుదలై దాదాపుగా రెండు నెలలు అవుతోంది. ఈ రెండు నెలల్లో ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి, వెళ్లిపోయాయి, కానీ ధురంధర్ మాత్రం ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
ఇకపోతే మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ చిత్రం తర్వాత రణవీర్ సింగ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు?, ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గానే మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముంబై కి వెళ్లి రణవీర్ సింగ్ ని కలిసొచ్చాడట. ఆయనకు ఒక ఊర మాస్ స్టోరీ ని వినిపించాడని, రణవీర్ సింగ్ కి స్టోరీ లైన్ బాగా నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని రమ్మని చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ‘ధురంధర్’ సిరీస్ తో రణవీర్ సింగ్ తెచ్చుకున్న ఇమేజ్ మొత్తాన్ని రిస్క్ లో పెట్టినట్టే అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే బోయపాటి శ్రీను ప్రస్తుతం ఫార్మ్ లో లేదు. రీసెంట్ గా బాలయ్య తో ఆయన చేసిన ‘అఖండ 2’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
అంతే కాదు బాలయ్య తో తప్ప, బోయపాటి శ్రీను కుర్ర హీరోలతో సినిమాలు చేస్తే ఫ్లాపులు తప్పవు అనే వాదన కూడా ఎప్పటి నుండో గట్టిగా వినిపిస్తూ వస్తోంది. ఈమధ్య కాలం లో ఆయన అల్లు అర్జున్ తో తప్ప, మిగిలిన యంగ్ హీరోలతో చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గానే నిల్చింది. అలాంటి డైరెక్టర్ కి రణవీర్ సింగ్ అవకాశం ఇచ్చి తన కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాడా?, అసలు ఈ ప్రాజెక్ట్ అవసరమా?, అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్స్ తో పని చెయ్యాలి కానీ, బోయపాటి లాంటోళ్లకు అవకాశం ఇవ్వండమేంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.