Heroes: దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు ఒమ్రికాన్ కేసులు పెరిగిపోతున్నాయి. థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టం కన్పిస్తున్నాయి. సెలబ్రెటీలంతా ఒకరి వెనుక మరొకరు తమకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో కరోనా భయాలు మళ్లీ అందరిలోనూ మొదలవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికి సైతం పాజిటీవ్ వస్తుండటం మరింత ఆందోళనను రేపుతోంది.

మహారాష్ట్రలో కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ ముందుగానే మెల్కోంది. పెద్ద హీరోలంతా ఇప్పటికే షూటింగులకు వచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో అక్కడ షూటింగులు నిలిచి పోతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీ ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుండగా తెలంగాణ సర్కారు కూడా ఆదిశగా ఆలోచిస్తోంది.
కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలంతా కరోనా బారిన పడుతుండటంతో కథ మళ్లీ మొదటికి వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్, హీరోయిన్ త్రిష, బాహుబలి కట్టప్ప సత్యరాజ్, మంచు లక్ష్మీ, సీనియర్ నటి శోభన తదితరులకు కరోనా పాజిటివ్ రావడంతో వారంతా హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలన్నీ కూడా వరుసగా ప్యాకప్ చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’, బాలకృష్ణ-గోపిచంద్ మనినేని కాంబినేషన్లోని మూవీ, ‘ప్రాజెక్టు కె’, తదితర సినిమాలన్నీ షెడ్యూల్ ను పోస్టు పోన్ చేసుకున్నాయి. అలాగే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన బడా సినిమాలు సైతం రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో కరోనా కథ మళ్లీ మొదటికి వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.