Pawan Kalyan: పవన్ తొలిప్రేమను గుర్తు చేసుకున్నారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో జనసేన సంపూర్ణ విజయం సాధించడంతో భావోద్వేగానికి గురయ్యారు. జనసేన 21 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి ఫలితాల్లో అన్నిచోట్ల విజయం సాధించింది. దీంతో పవన్ నాటి తొలిప్రేమను గుర్తు చేసుకున్నారు. అదేనండి తొలిప్రేమ సినిమాను. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు పవన్. రెండో సినిమా గోకులంలో సీత యావరేజ్ గా నిలవగా.. మూడో సినిమా సుస్వాగతం పరిశ్రమలో నిలబెట్టింది. తొలిప్రేమ రూపంలో భారీ హిట్ అందుకున్నారు పవన్. అందుకే నేటి రాజకీయ విజయంపై.. తొలిప్రేమతో పోల్చుకున్నారు.
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ సరైన విజయం ఇంతవరకు దక్కలేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్. భీమవరం తో పాటు గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో రకాల అవమానాలు పడ్డారు. ప్యాకేజీ స్టార్ అంటూ ముద్రవేశారు. దత్తపుత్రుడు, ముగ్గురు పెళ్ళాలు.. అంటూ పవన్ పై వెయ్యని ముద్ర లేదు. చేయని అవమానం లేదు. రెండు చోట్ల ఓడిపోయిన నేత.. జనసేన ఒక పార్టీయేనా? ఇలా రకరకాలుగా అవమానాలు చేశారు. దారుణంగా దుయ్యబట్టారు. ఇన్ని అవమానాలను అధిగమించుకొని.. సంపూర్ణ విజయాన్ని అందుకోవడంతో పవన్ ఆస్వాదిస్తున్నారు. సినీ కెరీర్లో తొలి హిట్టు తొలిప్రేమ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
చిన్నప్పటి నుంచి తనకు అవమానాలు ఎదురయ్యాయని. అవమానాలు ఎదురైన మరుక్షణం తాను పోరాట పట్టిన అలవాటు చేసుకున్నానని.. తనకు నిత్య పోరాటం అంటే ఇష్టమని పవన్ చెప్పుకొస్తున్నారు. ఫలితాల అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ధర్మాన్ని రక్షిస్తే.. అదే ధర్మం కాపాడుతుంది అన్న సూత్రాన్ని అలవాటు చేసుకున్నానని చెబుతున్నారు. మొత్తానికి అయితే పవన్ సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన తొలిప్రేమను.. ఇప్పటి విజయాన్ని అభివర్ణించడం ఆకట్టుకుంటోంది. ఇక పవన్ పొలిటికల్ కెరీర్ స్పీడు అందుకుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.