తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది సంగీత దర్శకులు వస్తుంటారు పోతుంటారు.. కానీ, కొందరు సమకూర్చిన స్వరాలు మాత్రమే ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నా.. సంగీత సాగరంలో ఓలలాడిస్తుంటాయి. అలాంటి దిగ్గజ సంగీత దర్శకుల్లో ముందు వరసలో ఉంటారు కీరవాణి. ఆయన అందించిన ఎన్నో ఆల్బమ్స్ ఇప్పటికీ.. శ్రోతల మదిని దోచుకుంటాయి. ఇవాళ ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం…
ఎం. ఎం. కీరవాణి 1990లో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. అయితే.. వెంటనే ఆయనకు బ్రేక్ దక్కలేదు. మూడో చిత్రంగా వచ్చిన ‘‘సీతారామయ్యగారి మనవరాలు’’ చిత్రం ఆయనలోని టాలెంట్ ను ప్రపంచానికి చాటిచెప్పింది. ‘‘పూసింది పూసింది పున్నాగా..’’ అంటూ సాగే పాట ఇప్పటికీ శ్రోతలను మైమరపిస్తుంది. ఈ చిత్రం తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు కీరవాణి ఖాతాలో పడ్డాయి. ఘరానా మొగుడు, మాతృదేవోభవ, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్‌చంద్రకాంత్, పెళ్లి సందడి, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి.. ఎన్నో హిట్స్ అందుకున్నారు. ఇక, జక్కన్న ఆస్థాన విధ్వాంసుడిగా.. రాజమౌళి తెరకెక్కించిన ప్రతీ సినిమాకూ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అన్నది తెలిసిందే. అంతేకాదు.. వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ అన్నది కూడా తెలిసిందే.
కేవలం తెలుగులోనే కాకుండా.. సౌత్ లోని తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటిన కీరవాణి.. బాలీవుడ్ కు సైతం తన స్వరాలను పరిచయం చేశారు. మగధీర, బాహుబలి చిత్రాలకు అందించిన సంగీతంతో దేశవ్యాప్తంగా కీరవాణి పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఎలాంటి సంగీతం అందించారో అనే ఆసక్తి సగటు సంగీత ప్రియుడిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అయితే.. కీరవాణి, రాజమౌళి అన్నాదమ్ములు అన్న సంగతి తెలిసిందే. అన్నదమ్ముల పిల్లలు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి సినిమా రచయితలే. వీరి కుటుంబం కూడా సంపన్నమైందే. అయితే.. ఓ సినిమా తీయడం.. నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడింది. ఆ సమయంలో సంగీత దర్శకుడిగా ఉన్న కీరవాణిపైనే కుటుంబాలు ఆధారపడ్డాయి. అయినప్పటికీ.. అందరినీ ఆయనే పోషించారట. ఇప్పుడు రాజమౌళి టాప్ డైరెక్టర్ గా మారడంతో.. కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోయాయి.
కీరవాణి కుటుంబంలోని ప్రతివారు సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక బంధం కలిగి ఉన్నారు. అయితే.. కీరవాణి సోదరుడు కల్యాణ్‌మాలిక్, సోదరి శ్రీలేఖ ఇద్దరూ సంగీత దర్శకులే. వీరు కూడా మంచి మంచి సినిమాలకు మ్యూజిక్ అందించారు. కాగా.. కీరవాణికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఆయన కెరీర్ మొదలు పెట్టినప్పుడే చెప్పారట. సరిగ్గా 20 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉంటానని, ఆ తర్వాత రిటైర్ అవుతానని అన్నారట. తన టాలెంట్ మీద ఎంత నమ్మకం లేకుంటే.. అలా అంటారు? సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశం వస్తుందో? ఎప్పుడు పోతుందో? ఎవ్వరూ చెప్పలేరు. అలాంటిది.. 20 ఏళ్లు కొనసాగి, రిటైర్ అవుతానని చెప్పడం సాధారణ విషయం కాదు. చెప్పిన దాన్ని సాధ్యం చేసి చూపించారు సుస్వరాల మాంత్రికుడు కీరవాణి. ఆయన.. ఇలాగే మరెన్నో అద్భుతమైన పాటలను అందించాలని, కీరవాణి రాగంలో శ్రోతలు మైమరచి పోవాలని ఆశిద్దాం… హ్యాపీ బర్త్ డే టూ కీరవాణి.