తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 31వ తేదీన దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇవాళ హీరోయిన్ ఛార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో.. ఎలాంటి వివరాలు సేకరించనున్నారనే ఆసక్తి నెలకొంది.
అయితే.. డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనే విషయంలో కాకుండా.. ఈ డ్రగ్స్ కొనుగోలు కోసం డబ్బులను ఎలా తరలించారు? ఎలాంటి అక్రమ పద్ధతుల్లో డబ్బును వెచ్చించారు? అనేది తెలుసుకోవడానికే ఈడీ విచారణ చేపడుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్ ను దాదాపు పది గంటలపాటు విచారించినట్టు సమాచారం.
ఆఫ్రికా దేశాల్లోని కొందరికి పూరీ అకౌంట్ నుంచి నగదు ట్రాన్స్ ఫర్ అయిన అంశంపై ప్రశ్నించగా.. అది సినిమా షూటింగుల కోసం పంపించానని పూరీ చెప్పినట్టుగా తెలుస్తోంది. పలు వివరాలు సేకరించిన ఈడీ అధికారులు.. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్టు సమాచారం. అయితే.. ఇవాళ పూరీ జగన్నాథ్ సినీ పార్టనర్ ఛార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో.. చార్మి నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగుతోందని తెలుస్తోంది. మనీలాండరింగ్ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. సినీ రంగానికి చెందిన 12 మంది బ్యాంక్ ఖాతాలు పరిశీలించే అవకాశం ఉంది.
అయితే.. ఈ విచారణ ద్వారా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సినీ ప్రముఖులకు తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం.. డ్రగ్ సప్లయర్ కెల్విన్ అప్రూవర్ గా మారి విచారణకు సహకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో.. గతంలో కెల్విన్-చార్మి మధ్య కొనసాగిన వాట్సాప్ చాట్ ఈడీకి అందినట్టుగా తెలుస్తోంది. దీని ఆధారంగానే ఛార్మికి నోటీసులు జారీచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఛార్మిని ఏ విధంగా విచారిస్తారు? ఆమె నుంచి ఎఇలాంటి సమాచారం రాబడతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ డ్రగ్స్ వ్యవహారంలో.. విచారణకు హాజరు కావాల్సిన వారి జాబితా పెద్దగానే ఉంది. ఆగస్టు 31న పూరీ హాజరుకాగా.. సెప్టెంబర్ 2వ తేదీన చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22వ తేదీ తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. వీరు ఇచ్చే సమాధానాల ద్వారా డ్రగ్స్ జాబితాలో మరికొందరి పేర్లు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.