Tollywood Drugs Case : తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో.. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణ వేగంగా కొనసాగుతోంది. ఆగస్టు 31వ తేదీన దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మొదలైన విచారణ.. ఒక్కొక్కరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, నందు, నవదీప్ ను విచారించారు. ఇవాళ (సెప్టెంబర్ 15) ముమైత్ ఖాన్ విచారణకు హాజరయ్యారు.
ప్రధానంగా వీరి నుంచి బ్యాంక్ లావాదేవీల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. కెల్విన్ తదితరులకు డబ్బులు ఎందుకు చెల్లించారు? వంటి వివరాలపై ఆరాతీస్తున్నారు. వీరు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అని కాకుండా.. అక్రమ పద్ధతుల్లో డబ్బును వెచ్చించారా? అని తెలుసుకోవడానికే ఈడీ విచారణ చేపడుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద విచారణ జరుగుతోంది.
2017లో నమోదైన కేసుల ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ఎక్సైజ్ సిట్ విచారణకు భిన్నంగా కొనసాగుతోందని తెలుస్తోంది. మనీలాండరింగ్ కోణంలోనే వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ సిట్ నుండి వివరాలు సేకరించిన ఈడీ.. వాటి ఆధారంగానే సినీ ప్రముఖుల బ్యాంక్ ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అయితే.. ఇవాళ ముమైత్ ఖాన్ షెడ్యూల్ ప్రకారం విచారణకు హాజరయ్యారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మీడియా ప్రతినిధులు.. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆమె ఏ విధంగానూ స్పందించలేదు. ముమైత్ వాహనం దిగింది మొదలు.. ఈడీ కార్యాలయానికి వెళ్లే వరకూ ఆమెను మీడియా ప్రతినిధులు అనుసరించారు. ఈ డ్రగ్స్ కేసు గురించి ఏదైనా మాట్లాడాలని కోరినప్పటికీ.. ఆమె మాట్లాడలేదు.
తన ఇద్దరు బాడీ గార్డులతో ఈడీ కార్యాలయంలోని మొదటి అంతస్తుకు చకచకా వెళ్లిపోయిన ముమైత్ ఖాన్.. అక్కడ రిజిస్టర్ లో సంతకం చేసి, విచారణ గదిలోకి వెళ్లిపోయారు. అయితే.. ఆమె వెంట ఒక సూట్ కేసు తెచ్చుకున్నారు. దీంతో.. అందులో ఏం ఉండొచ్చు? అనే చర్చ సాగుతోంది. ఈడీ అధికారులు ఏవైనా డాక్యుమెంట్లు అడిగారా? అనే ప్రశ్నలు మీడియా ప్రతినిధుల నుంచి వ్యక్తమయ్యాయి.