సినిమా ఇండస్ట్రీలోకి బండ్ల గణేష్ ఒక కమెడియన్ గా అడుగు పెట్టాడు. తొలినాళ్లలో గుంపులో గోవింద అన్నట్టుగా ఉండేవాడు. కానీ.. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ తో సినిమా తీసి నిర్మాతగా మారాడో.. ఒక్కసారిగా అతని రేంజ్ మారిపోయింది. తనదైన స్పెషల్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. తొలి మూవీ ‘తీన్మార్’ నిరాశ మిగిల్చినా.. మళ్లీ పవన్ తో ‘గబ్బర్ సింగ్’ మూవీ చేసి ఇండస్ట్రీ దద్దరిల్లిపోయే హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత కూడా నిర్మాతగా జోరు కొనసాగించాడు. స్టార్ హీరోలు, దర్శకులతో సినిమాలు తీశాడు. అయితే.. సక్సెస్ ను ఎక్కువగా కాలం కొనసాగించలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్-పూరీ జగన్నాథ్ తో తీసిన టెంపర్ చిత్రం తర్వాత చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నాడు బండ్ల. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా నిర్మించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలో అది సాధ్యం కాబోతోందని కూడా అంటున్నారు. అయితే.. ఇప్పుడు అంతకన్నా క్రేజీ న్యూస్ ఒకటి రిలీజ్ అయ్యింది.
నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడిగా కూడా అవతారమెత్తిన బండ్ల గణేష్.. ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఇదో హాట్ న్యూస్. అయితే.. ఇందులో నిజమెంత అనే సందేహాలేం వద్దు. ఇది నిజమే. తమిళంలో సూపర్ హిట్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ను రీమేక్ చేయబోతున్నాడు బండ్ల. ఇందులో విశేషం ఏమంటే.. ఒకే ఒక్క క్యారెక్టర్ ఉంటుందీ చిత్రంలో!
గతంలో రెండు, మూడు క్యారెక్టర్లో సినిమాలు వచ్చాయి. కానీ.. ఇది ఏకైక క్యారెక్టర్ తో వచ్చిన సినిమా! ‘ఒత్త సెరుప్పు అళవు7’ అనే టైటిల్ తో ఇచ్చిన ఈ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాను బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో బండ్ల తీస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా.. బండ్ల గణేష్ హీరో కూడా అయిపోతున్నారు. మరి, ఎలాంటి ఫీట్ నమోదు చేస్తాడో చూడాలి.