
టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటి అయ్యి షూటింగ్ లకు అనుమతులు కోరారు. కానీ ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. షూటింగ్ లకు అనుమతులు తెలంగాణలోనే చాలా? ఏపీలో వద్దా? అని పలువురు విమర్శించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మీటింగ్ లు, కమిటీల పేరిట కాలయాపన చేస్తుండడంతో షూటింగ్ ల అనుమతిపై జాప్యం జరుగుతోంది.
ఇక అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలకు జడిసి ఎట్టకేలకు టాలీవుడ్ ఏపీ వైపు కదులుతోంది. ఏపీ సీఎం జగన్ ను టాలీవుడ్ పెద్దలు కలవడానికి మూహూర్తం నిర్ణయించారు. ఈనెల 9న టాలీవుడ్ ప్రముఖులతో సీఎం జగన్ భేటి ఖాయమైంది.
టాలీవుడ్ తో ఏపీ సీఎం జగన్ భేటికి సినీ రంగంలోని ప్రతి రంగం నుంచి ఇద్దరు ప్రముఖులను ఈ భేటికి తీసుకువెళుతున్నారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, దర్శకులు, స్టూడియోల వారితోపాటు మా అసోసియేషన్ , ఫిల్మ్ చాంబర్ ల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా ఏపీ సీఎం జగన్ తో భేటికి హాజరవుతున్నారు.
ఇప్పటికే ఏపీ సీఎం జగన్ తో భేటి అయ్యే ప్రముఖల జాబితాను తయారు చేసినట్టు తెలిసింది. కానీ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటికి తనను ఎవరూ పిలవలేదని నోరుపారేసుకున్న నందమూరి బాలక్రిష్ణను ఏపీ సీఎం జగన్ తో భేటికి పిలిచారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.
ప్రస్తుతానికి టాలీవుడ్ నుంచి దర్శకుల్లో రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి దర్శకులు, మా అసోసియేషన్ నుంచి నరేశ్, జీవితలతోపాటు అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జునలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది.
అయితే ఏపీ సీఎం జగన్ తో భేటిలో ప్రధానంగా షూటింగ్ లనే అంశమే కాకుండా ప్రధాన ఎజెండా వేరే ఉందని తెలుస్తోంది. ఏపీ సీఎం అపాయింట్ మెంట్ కోరినప్పుడే టాలీవుడ్ పరిశ్రమ విశాఖకు తరలివచ్చే అంశాలపై నివేదికలతో ముందుకు రావాలని జగన్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఎజెండానే ప్రధాన అంశంగా జగన్ తో టాలీవుడ్ భేటి జరగబోతోందని తెలుస్తోంది..
-నరేశ్ ఎన్నం