- క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి.. వెంకటేశ్వరరావు వర్ధంతి నేడు..
Gummadi: అభినయ కౌశలం, వాక్ చాతుర్యం, కలగలిపిన ఓ నిండైన ఒరవడి గుమ్మడి లేని తెలుగు సినీ పరిశ్రమని ఊహించలేం. హీరోగా ఈయనకి సత్ఫలితం ఇవ్వలేదు. ఐతేనేం.. ఐదు దశాబ్దాల పాటు ఐదు వందల చిత్రాల్లో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా అన్ని తరహా ఉప పాత్రలలో తనదైన ముద్ర వేసి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. ఏ పనిచేసినా మనచేతికి మట్టి అంటకుండా చేయాలంటూ తేనె పూసిన కత్తి తరహా విలన్ పాత్రలు కూడా చాలా సినిమాల్లో వేసి మెప్పించారు.

మహామంత్రి తిమ్మరుసు, ఈడు జోడు, కులదైవం, భలే రంగడు, జైజవాన్, వాగ్దానం, సి ఐ డి, రాజమకుటం వంటి అనేక చిత్రాలలో గుమ్మడి నటన అనితరసాధ్యం అని చెప్పాలి. కరుణరసాత్మక పాత్రలను కూడా చాలా ధరించారు. ఎస్ వి రంగారావు వంటి నటులతో సమవుజ్జీగా నటించగల సత్తా కేవలం గుమ్మడి కే సాధ్యం. ఈయన సంభాషణలు పలికే తీరులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. ఫో అవతలికి.. అనేది చాలా కామన్ గా గుమ్మడి పలికే డైలాగ్. ఏ పాత్ర ధరించినా పూర్తి అవగాహనతో నటించడం ఈయనకి పరిపాటి.
అక్కినేని నాగేశ్వరరావు తో గుమ్మడికి ఉన్న సాన్నిహిత్యం చివరివరకూ కొనసాగింది. జీవితం చివరి రోజుల్లో వీరిరువురు, కాంతారావు చాలా తరచుగా కలుసుకుని ముచ్చటించుకునే వారు. గుమ్మడి అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ అధ్యాయం. 82 సంవత్సరాలు జీవించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు 2010లో ఈరోజే అందరికీ దూరమయ్యారు.
-శెనార్తి