పండగ సీజన్ వస్తోందంటే థియేటర్లు కళకళలాడుతాయి.. అప్పుడే నిర్మాత గల్లాపెట్టె కూడా గలగలమంటుంది. అయితే.. గతంలో దసరా, సంక్రాంతి మాత్రమే బిగ్ ఫెస్టివల్స్ గా పరిగణించేవారు. కానీ.. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రతీ అకేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అయ్యింది ఇండస్ట్రీకి. ఇందులో భాగంగానే రేపటి శివరాత్రిపై ఫోకస్ పెట్టాయి పలు సినిమాలు. ఈ పర్వదినానికి జాగారం బోనస్ కావడంతో.. ఇది కూడా మంచి రిలీజ్ డేట్ అంటున్నారు మేకర్స్.
ఈ శివరాత్రికి ఒకేసారి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో ఒకటి శర్వానంద్ శ్రీకారం, రెండోది నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు, మూడోది శ్రీవిష్ణు గాలి సంపత్. ఈ మూడు చిత్రాలు కూడా మంచి ప్రమోషన్ తో అంచనాలు పెంచేశాయి. దీంతో.. శివరాత్రి సక్సెస్ అందుకునే చిత్రం ఏదోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శర్వా శ్రీకారం చిత్రం రైతు సమస్యల నేపథ్యంలో వస్తోంది. ఇది ఓ షార్ట్ ఫిలిం ప్రేరణతో రూపొందించడం విశేషం. లేటెస్ట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ రావడంతో హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా.. శర్వా చిత్రాలకు ఆడియన్స్ లో ఎల్లప్పుడూ మంచి క్రేజ్ ఉంటోంది. ఇక, టీజర్ కూడా అలరించింది.
ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు.. మంచి బజ్ క్రియేట్ చేసింది. పేరుతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం.. ట్రయిలర్ కూడా ఆకట్టుకుంది. ఇందులో కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అదనపు ఆకర్షణగా నిలవబోతున్నారు. గాలిసంపత్ కూడా క్యూరియాసిటీని ఫిల్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతగా, ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి, ఈ మూడు చిత్రాల్లో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతుందన్నది ఆసక్తిగా మారింది.
ఇదిలాఉంటే.. ఇదే అకేషన్ కు మరికొన్ని సినిమా విశేషాలు కూడా ప్రేక్షకులను అలరించబోతున్నాయి. శివరాత్రి సందర్భంగానే పవన్-క్రిష్ పీరియాడికల్ డ్రామాకు సంబందించిన టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా.. బాలయ్య-బోయపాటి సినిమా పేరు కూడా ఇవాళే వెల్లడించబోతున్నారు. ఈ విధంగా.. శివరాత్రి సినీ అభిమానులకు విందు భోజనాన్నే వడ్డిస్తోంది.