Ramgopal Varma: ఏపీలో ఎన్నికల వేళ పొలిటికల్ డ్రామాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. యాత్ర 2 టైటిల్ తో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రం ఫిబ్రవరి 8న విడుదలైంది. ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ పిక్ అని చెప్పాలి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు యాత్ర 2 చిత్రంలో చూపించారు. యాత్ర 2 సీఎం జగన్ ఇమేజ్ ఎలివేట్ చేసేలా చిత్రీకరించబడింది. యాత్ర 2లో పరోక్షంగా జగన్ ప్రత్యర్థులను టార్గెట్ చేశారు.
మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఇది కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తెరకెక్కించిన చిత్రం. ఇందులో నేరుగా కొందరు రాజకీయ నాయకులను ఆర్జీవీ టార్గెట్ చేశాడు. పార్టీ గుర్తులు, పేర్లు ఉన్నవి ఉన్నట్లు పెట్టి చిత్రీకరించారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, సోనియా గాంధీలను విలన్స్ గా చిత్రీకరించి తెరకెక్కించాడు.
వ్యూహం మూవీ తమను కించపరిచేలా, వ్యక్తిత్వం దెబ్బతీసేలా ఉందని నారా లోకేష్ కోర్టులో కేసు వేశాడు. దాంతో డిసెంబర్ 29న విడుదల కావాల్సిన వ్యూహం వాయిదా పడింది. తెలంగాణ హై కోర్ట్ సెన్సార్ సభ్యులు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేసింది. ఈ క్రమంలో వ్యూహం విడుదల కష్టమే అని అందరూ భావించారు. అయితే రామ్ గోపాల్ వర్మ కోర్టు సూచనల ఆధారంగా మార్పులు చేయడంతో వ్యూహం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూహం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు వర్మ… నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ లో వ్యూహం విడుదలై ఉంటే జనాలు ఇప్పటికి మర్చిపోయేవారు. తెలివైన లోకేష్ వ్యూహం పన్ని ఎన్నికలకు ముందు వ్యూహం రిలీజ్ అయ్యేలా చేశాడు. మై డియర్ లోకేష్ కారణంగా మేమంతా సంతోషంగా ఉన్నాను… అని లోకేష్ కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.