
OScar: మార్చి 13వ తేదీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మర్చిపోలేని రోజు. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవసం చేసుకుంది. నెలల పాటు సాగిన రాజమౌళి శ్రమ ఫలితం ఇచ్చింది. తన చిత్రానికి ఆస్కార్ అందుకునే స్థాయి ఉందని గట్టిగా నమ్మిన రాజమౌళి.. అనేక వ్యయప్రయాసలకోర్చి ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. తీసుకెళ్లడమే కాకుండా అవార్డుతో వచ్చారు. వరల్డ్ వైడ్ అభిమానులున్న స్టార్ అమెరికన్ సింగర్ లేడీ గాగా రూపొందించిన హోల్డ్ మై హ్యాండ్ సాంగ్ ని కూడా వెనక్కి నెట్టి నాటు నాటు అవార్డు కైవసం చేసుకుంది.
ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. భారత ప్రధాని నుండి సామాన్య సినిమా ప్రేమికుడి వరకు తమ ఆనందం, అభినందనలు తెలియజేశారు. ఆస్కార్ అనేది హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితం, మనం ఆ దరిదాపుల్లోకి వెళ్లలేమని ఉన్న ఒక నమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఆస్కార్ అందని ద్రాక్ష కాదు, సినిమాలో సత్తా, సాధించాలనే సంకల్పం ఉంటే అందుకోవడం సాధ్యమే అని నిరూపించారు.

ఆస్కార్ గురించి జనాల్లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెల్ల వాళ్ళ మీద పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని వాళ్లకు వ్యతిరేకంగా తీసిన సినిమాకు వాళ్లే పిలిచి అవార్డులు ఇచ్చారు. గమ్మత్తంటే ఇదే అంటున్నారు. మన వీరుల గొప్పతనం వివరిస్తూ బ్రిటీష్ వారిపై సాధించిన విజయంగా తెరకెక్కించిన సినిమాను తెల్లవాళ్ళు ఆస్కార్ తో గౌరవించడం నిజంగా విడ్డూరం అంటున్నారు. ఇండియన్స్ లో ఈ విచిత్ర చర్చ నడుస్తుంది. దీన్ని ఒక అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు.
అయితే వాళ్ళు అనుకుంటున్నట్లు బ్రిటీష్ వాళ్లకు కానీ, తెల్లజాతికి కానీ ఆస్కార్ అవార్డుతో ఎలాంటి సంబంధం లేదు. ఇది అమెరికన్స్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ అవార్డు. 1929లో ఫస్ట్ ఆస్కార్ ఈవెంట్ జరిగింది. 270 సినిమా ప్రముఖులు పాల్గొన్న మొదటి ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్ లో జరిగింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ దశాబ్దాలుగా అకాడమీ అవార్డ్స్ అందిస్తున్నారు. కాబట్టి అకాడమీ అవార్డు అమెరికన్స్ ఏర్పాటు చేసిన అవార్డు. అయితే వేలకొలది ఉంటే ఆస్కార్ జ్యూరీ సభ్యుల్లో బ్రిటీష్ వాళ్లు ఉండొచ్చు.