అయితే మొదటి సినిమాతో ఏ మాత్రం అంచనాలను అందుకోలేక పరాజయ పరాభవంతో కింద పడి మానసికంగా నలిగిపోయినా.. మళ్ళీ తిరిగి నిలబడి భవిష్యత్తు సినీ తరాలకు పోరాట స్ఫూర్తి గా నిలిచారు మన స్టార్స్. మరి వారి గురించి తెలుసుకుందాం.
పడి లేచిన కెరటం అనే వ్యాఖ్యానానికి కరెక్ట్ నిర్వచనంలా సాగింది జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్. తొలి చిత్రం దారుణంగా ఫ్లాప్ అయినప్పటికి ఆ తరువాత తారక్ తారజువ్వలా ఎగసి సినీ కళామతల్లి ఒడిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ తారక్ కి మరో సాలిడ్ హిట్ పడలేదు. ఇక నిలబడటం కష్టం అనుకుంటున్న సమయంలో యమదొంగతో మళ్ళీ బాక్సాఫీస్ రికార్డులను చెరిపేసాడు.
‘బాహుబలి’తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. మొదటి సినిమా ఈశ్వర్ వైఫల్యంతో ప్రభాస్ హీరోగా నిలబడటం కష్టమే అన్న విమర్శలు వచ్చాయి అప్పట్లో. కానీ, బాహుబలితో విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు పాన్ ఇండియా అనగానే మొదట గుర్తుకువచ్చేది ప్రభాసే.
నేడు పవన్ కళ్యాణ్ అంటే స్టార్ లకు రారాజు. కానీ పరాజయం నుంచి పవర్ స్టార్ దాకా ఎదిగాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందా ఆ సినిమా. ఆ తర్వాత ‘బద్రి’, ‘ఖుషి’ నుండి పవన్ ప్రభంజనం రోజురోజుకు ప్రవాహంలా సాగుతూనే ఉంది.
అక్కినేని వారసుడు నాగచైతన్య ‘జోష్’ అంటూ వచ్చినా చివరకు జోష్ లేకుండా పోయింది. చైతు అరంగేట్రం పై అక్కినేని అభిమానులే అనేక రకాల విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత గౌతమ్ మేనన్ తో చేసిన ‘ఏమాయ చేసావె’తో చైతు నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేశాడు. ఆ తర్వాత ‘100 %లవ్’, ‘ప్రేమమ్’ లాంటి సినిమాలతో మంచి మార్కెట్ ను సాధించుకున్నాడు.
ఇలా ఈ హీరోలు మొదటి సినిమాతో ఎలా ప్లాప్ ను చూశారో కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కూడా మొదటి అడుగులోనే పరాజయాన్ని చవిచూశారు. హరీశ్ శంకర్ తొలి సినిమా ‘షాక్’. ఈ సినిమా హరీష్ కి నిజంగానే షాక్ ఇచ్చింది. మరో స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి. మొదటి సినిమా ‘మున్నా’. ఈ సినిమా ఏ రేంజ్ లో ప్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
‘జాతి రత్నాలు’ అంటూ నవ్వుల్లో ముంచెత్తిన కేవీ అనుదీప్ తీసిన మొదటి సినిమా ‘పిట్టగోడ’ పెద్ద డిజాస్టర్. అలాగే ప్రవీణ్ సత్తారు తొలి సినిమా ‘ఎల్బీడబ్ల్యూ’ కూడా భారీ ప్లాపే. మొత్తానికి మొదటి పరాజయంతో మంచి గుణపాఠం నేర్చుకొని హిట్ కొట్టారు చాలామంది సినీ స్టార్స్.