Homeఎంటర్టైన్మెంట్The Vaccine War Review: "ది వ్యాక్సిన్ వార్" మూవీ రివ్యూ..

The Vaccine War Review: “ది వ్యాక్సిన్ వార్” మూవీ రివ్యూ..

The Vaccine War Review: సినిమా టైటిల్: ది వ్యాక్సిన్ వార్
నటీనటులు: నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, రైమా సేన్, గిరిజా ఓక్, సప్తమి గౌడ, తదితరులు.
నిర్మాణ సంస్థ: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిర్మాతలు: పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్.
దర్శకత్వం: వివేక్ అగ్నిహోత్రి
సంగీతం: రోహిత్ శర్మ, వన రాజ్ భాటియా
సినిమాటోగ్రఫీ: ఉదయ సింగ్ మోహితే
ఎడిటర్: శంఖ రాజాధ్యక్ష
విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023

కోవిడ్ వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికించింది. మందులేని ఈ వ్యాధి లక్షలాదిమంది ప్రాణాలను బలిగొంది. వేలాది కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఈ అంశం చుట్టూ కథ అల్లుకుని వివేక్ అగ్నిహోత్రి “ది వ్యాక్సిన్ వార్” అనే సినిమాకు దర్శకత్వం వహించారు. వివేక్ గత ఏడాది ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. సున్నితమైన అంశం చుట్టూ కథ అల్లుకొని సినిమా తీయడంతో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకొంతమందిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ సినిమా తర్వాత వివేక్ ఏడాది పాటు గ్యాప్ తీసుకుని తీసిన చిత్రం కావడంతో ది వ్యాక్సిన్ వార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ సమయంలో వైరస్ బారిన పడినవారు నరకం చూశారు. పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు వెనుకడగు వేశారు? ఇదే సమయంలో మహిళా శాస్త్రవేత్తలు మేమున్నామంటూ ముందడుగు ఎందుకు వేశారు? వ్యాక్సిన్ తయారు చేయడం ఇండియా వల్ల కాదని చాలామంది చెప్పినప్పటికీ.. కేవలం 7 నెలల సమయంలోనే సొంత వ్యాక్సిన్ భారత్ ఎలా తయారు చేయగలిగింది? వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలు ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నారు? ఈ అంశాల ఆధారంగా వివేక్ ది వ్యాక్సిన్ వార్ సినిమా రూపొందించారు.

ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్( ఐసీఎంఆర్ ) మాజీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ బలరాం భార్గవ్ రాసిన గోయింగ్ వైరల్ అనే పుస్తక ఆధారంగా ఈ చిత్రాన్ని వివేక్ తెరకెక్కించారు. వ్యాక్సిన్ వార్, వాస్తవ ప్రపంచంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ ( నానా పటేకర్) తన శాస్త్రవేత్తల బృందంతో న్యుమోనియా లాంటి వ్యాక్సిన్లు తయారు చేస్తూ ఉంటారు. దీనికి ఆయన ఒక బృందాన్ని నియమించుకుంటారు. అదే సమయంలో నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ హెడ్ గా డాక్టర్ అబ్రహం ( పల్లవి జోషి) వీరందరి నేతృత్వంలో భారత్ కోసం పలు వ్యాక్సిన్ ల తయారీలో కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు. ఇలా జరుగుతుండగానే భారత్ సహా ప్రపంచం లోని అన్ని దేశాలు కోవిడ్ బారిన పడతాయి. ప్రజలందరూ తమ ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బతుకుతుంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితిని ప్రజలకు తెలియజేసేందుకు మీడియా కూడా ప్రాణాలకు తెగించే పని చేస్తుంటుంది. ఈ మీడియాలో జర్నలిస్టుగా ( రైమా సేన్) అనేక నిజ జీవితాలను వెలికితీస్తుంది. ఇదే సమయంలో కొన్ని తప్పుడు వార్తలను కూడా ప్రసారం చేస్తూ ఉంటుంది. ఆమె నేతృత్వంలోని మీడియాకు చెందిన ఒక విభాగం తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ శాస్త్రవేత్తలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. రైమా సేన్ తో పోరాడుతూ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది.. అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి.

కోవిడ్ విజృంభిస్తున్నప్పుడు వ్యాక్సిన్ తయారు చేసేందుకు చాలామంది పురుష శాస్త్రవేత్తలు వెనుకడుగు వేస్తారు. అలాంటి సమయంలో మేమున్నామంటూ మహిళ శాస్త్రవేత్తలు ముందుకు వస్తారు. అయితే ఈ బృందంలో డాక్టర్ భార్గవ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తయారీలో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది? వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత వచ్చింది? నిజంగా మన మెడికల్ సిస్టం నిజ స్వరూపం వేరే విధంగా ఉందా? కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశం ఎలా పోరాడింది? శాస్త్రవేత్తలపై ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? అనేక చిక్కుముడి లాంటి ప్రశ్నలకు ఈ సినిమా ద్వారా వివేక్ సమాధానం చెప్పారు. అయితే ఈ సమాధానాలు ఎలా చెప్పారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కోవిడ్ టైంలో అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా వ్యాక్సిన్ తయారు చేయలేక చేతులు ఎత్తేసిన సందర్భంలో.. భారత్ వ్యాక్సిన్ తయారుచేసి తన సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు చెప్పింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ది వ్యాక్సిన్ వారు సారాంశం కూడా ఇదే. అయితే కథ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వివేక్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా మనిషి జీవితంలో, వారి ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో శాస్త్రవేత్తల పాత్ర ఎంత ఉందో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తన గత సినిమా కాశ్మీర్ ఫైల్స్ ద్వారా విమర్శలు ఎదుర్కొన్న వివేక్.. ఈ సినిమా ద్వారా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాదు కోవిడ్ 19 కేసులకు మైనారిటీలు ఎలా కారణమయ్యారు, కోవిడ్ వ్యాప్తిలో వారు చేసిన తప్పు ఏంటి అనే విషయాలను స్పష్టంగా చెప్పారు. కుంభమేళా, పలు ర్యాలీలు, డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి వంటి విషయాలను చాలా స్పష్టంగా వివేక్ చూపించారు. మరోవైపు రెండవ వేవ్ సమయంలో వైరస్ వ్యాప్తికి రాజకీయ ర్యాలీలు కూడా కారణమని ఈ చిత్రం ద్వారా వివేక్ చెప్పే ప్రయత్నం చేశారు. పైగా ప్రభుత్వాలు ఎక్కడ తప్పు చేశారో స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ కొంచెం విసుగు తెప్పించినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం స్క్రీన్ కు అతుక్కునేలా చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న మహిళా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ల్యాబ్ లోనే వారి జీవితాన్ని ఎలా గడిపారు అనేదాన్ని చాలా హృద్యంగా చూపించాడు వివేక్. ఈ సన్నివేశాలు చూసిన వారికెవరికైనా కళ్ల వెంట నీళ్లు వస్తాయి. ఇక విదేశీ వ్యాక్సిన్ లను భారతదేశంలో ఎక్కువగా ప్రచారం చేయడం, వారి వ్యాపార సామ్రాజ్యం కోసం జరుగుతున్న లాబీయింగ్ సీన్లు ఆలోచింపచేస్తాయి. మీడియా ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ప్రధాన చర్చకు దారి తీస్తుంది. అయితే “భారతదేశానికి వ్యాక్సిన్ తయారు చేయడం చేతకాదు అని మీడియా మొత్తం నమ్మిందా” అనేలా చిత్రీకరించిన సన్నివేశాలు కొంతమేరకు అభ్యంతరకరంగా ఉంటాయి.

ఈ సినిమాలో భార్గవ పాత్ర లో నానా పటేకర్ అద్భుతంగా నటించాడు. ఒక శాస్త్రవేత్త బాడి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, కీలక సమయంలో అతడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో చూపించాడు. అబ్రహం పాత్రలో పల్లవి జోషి నటించింది. ఇక మిగతా పాత్రధారులు వారి వారి పరిధి మేరకు నటించారు. భారతీయ శాస్త్రవేత్తలు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశారు. వారికోసం ఈ సినిమాలు కచ్చితంగా చూడవచ్చు. వారు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా దేశ ప్రజల ప్రణాళికాపాడేందుకు ఎలా పని చేశారో వివేక్ చెప్పిన విధానం ఆలోచింపజేస్తుంది.

ఈ సినిమా ఎడిటింగ్ మరింత పటిష్టంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఈ సినిమాలో మీడియాను విలన్ గా చూపించడం బాగోలేదు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి జర్నలిస్టులు అసలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గుర్తించడంలో వివేక్ ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. రైమా సేన్ పోషించిన జర్నలిస్టు పాత్రను వివేక్ నెగిటివ్ గా చూపించడం కొంతవరకు ఇబ్బందికరంగా ఉంది. శాస్త్రవేత్తలు ప్రజలు కలిగించే ఎమోషన్ సీన్లు బాగా పండాయి. రాజకీయ సంఘర్షణలు తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా విజయవంతమయ్యాడు.. సినిమా పూర్తి అయిన తర్వాత కోవిడ్ సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలు ప్రతి ఒక్కరి ఎదుట ప్రత్యక్షమవుతాయి..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version