Balakrishna: సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. కాంబినేషన్స్, టైటిల్స్, యాక్టర్స్, సీజన్స్, హీరోయిన్స్ ఇలా అనేక నమ్మకాలు పెట్టుకుంటారు. సదరు సెంటిమెంట్ ఫాలో అయితే హిట్ గ్యారెంటీ అనుకుంటున్నారు. నందమూరి అందగాడు బాలయ్యకు ఇలాంటి సెంటిమెంట్స్ అనేకం ఉన్నాయి. ఆయన తాయత్తుల నుండి రంగురాళ్ల వరకూ అన్నీ నమ్ముతారు. బాలయ్య మెడలో, చేతినిండా పలు దేవుళ్ళకు చెందిన దారాలు ఉంటాయి. ఉంగరాలు వేళ్ళకు ఉంటాయి. అవి కాక బాలయ్యకున్న మరో బలమైన సెంటిమెంట్ టైటిల్. తన సినిమా టైటిల్ లో సింహం పదం ఉంటే బ్లాక్ బస్టర్ అనేది ఆయన విశ్వాసం. కాబట్టి సింహం అనే పదం కలిసొచ్చేలా టైటిల్ ఉండాలని భావిస్తారు.

1999 వచ్చిన సమరసింహారెడ్డి, 2001లో విడుదలైన నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. దీంతో ఆయన బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు. రెండు దశాబ్దాలకు పైగా బాలకృష్ణ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. స్వతహాగా నరసింహస్వామి భక్తుడైన బాలయ్య సింహం పదాన్ని వదలడం లేదు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టైటిల్ లో కూడా ఆయన సింహం ఉండేలా చూసుకున్నారు. వీరసింహారెడ్డి అని టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
మరి బాలయ్య నమ్ముతున్నట్లు సింహం సెంటిమెంట్ ఆయనకు కలిసొస్తుందా? బాలయ్య కెరీర్లో ఎన్ని సినిమాలు సింహం అనే పదం ఉన్న టైటిల్ తో చేశారు? వాటిలో ఎన్ని హిట్? ఎన్ని ఫట్? అనేది చూద్దాం… నటుడిగా పరిచయమైన కొత్తలో నాన్న ఎన్టీఆర్ తో కలిసి బాలయ్య సింహం నవ్వింది(1983) టైటిల్ తో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేశారు. ఈ మూవీ నిరాశపరిచింది. స్టార్ గా నిలదొక్కుకున్న బాలయ్య బొబ్బిలి సింహం(1994) టైటిల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైన్ చేశారు. బొబ్బిలి సింహం సూపర్ హిట్.
ఇక సమరసింహారెడ్డి(1999) మూవీతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ మూవీ విడుదలైన రెండేళ్ల తర్వాత నరసింహనాయుడు(2001) చేశారు. మరోసారి బాలయ్య-బి గోపాల్ కాంబినేషన్ రిపీట్ చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన నరసింహనాయుడు మరో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది.
ఆ దశలో బాలయ్య వరుసగా ఫ్యాక్షన్ చిత్రాలు చేశారు. సీమ సింహం(2002) టైటిల్ తో చేసిన మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. యావరేజ్ గా నిలిచింది. లక్ష్మీ నరసింహ(2004) చిత్రంలో బాలకృష్ణ సీరియస్ అండ్ కరప్టెడ్ పోలీస్ రోల్ చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన లక్ష్మీ నరసింహ హిట్ స్టేటస్ అందుకుంది. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం సింహ(2010). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ బాలయ్యకు మరో భారీ హిట్ ఇచ్చింది. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న బాలయ్య జై సింహ(2018)టైటిల్ తో ఒక మూవీ చేశారు. ఇది మాత్రం ప్లాప్ అయ్యింది. ఇక 2023 సంక్రాంతికి విడుదల కానున్న వీరసింహారెడ్డి ఫలితం రావాల్సి ఉంది. కాబట్టి సింహం సెంటిమెంట్ బాలయ్యకు బాగా కలిసొచ్చింది. ఒకటి రెండు మినహాయిస్తే అన్ని చిత్రాలు విజయాలు నమోదు చేశాయి.