Vyooham: ‘వ్యూహం’ బెడిసి కొడుతుందా?

వాస్తవానికి ఈరోజు సినిమా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ గురువారం సాయంత్రం ఉన్నపలంగా సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను వారం రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక ప్రకటన ఇచ్చింది.

Written By: Dharma, Updated On : February 23, 2024 11:14 am
Follow us on

Vyooham: వ్యూహం సినిమా ఎందుకు విడుదల కాలేదు? సెన్సార్ పూర్తయినా ఎందుకు ధ్రువీకరణ పత్రం రాలేదు? అసలు ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చగా నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ వ్యూహం, శపథం అనే సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్ వన్ వ్యూహం చిత్రీకరణ ఏనాడో పూర్తయింది. కానీ చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ.. రాజకీయ దురుద్దేశంతో చిత్రాన్ని రూపొందించారంటూ నారా లోకేష్ ఏకంగా సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. అయినా సరే సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దీంతో లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సింగిల్ బెంచ్ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరో బెంచ్ మాత్రం సినిమాలో అభ్యంతరకర సీన్లు మార్చి విడుదల చేసుకోవచ్చు అని అనుమతించింది. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్నా సినిమా విడుదల కాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. సెన్సార్ బోర్డు దగ్గర సర్టిఫికెట్ సంపాదించలేకపోవడమే.. ఈ సినిమా విడుదలలో జాబ్యానికి కారణం.

వాస్తవానికి ఈరోజు సినిమా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ గురువారం సాయంత్రం ఉన్నపలంగా సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను వారం రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక ప్రకటన ఇచ్చింది. ముంబాయి నుంచి రావాల్సిన సర్టిఫికెట్ రాకపోవడమే కారణంగానే సినిమాను వాయిదా వేసినట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే అని చెబుతున్నా..సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ఇంతవరకు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది.

మరోవైపు ఎన్నికల షెడ్యూల్ మార్చి 9న వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఈ రెండు చిత్రాలు విడుదల చేయాలని యూనిట్ బృందం సంకల్పించింది. మార్చి ఒకటిలోగా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వస్తే పర్వాలేదు.. లేకుంటే ఇంతలో ఎన్నికల షెడ్యూల్ కానీ.. నోటిఫికేషన్ వస్తే కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టే అవకాశం ఉంది. చిత్రం విడుదల ప్రశ్నార్ధకంగా మారనుంది.