Salaar: ప్రభాస్ ని ఒక సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆయన ప్రతి సినిమా విడుదల వాయిదా పడుతుంది. బాహుబలి, బాహుబలి 2, సలార్, రాధే శ్యామ్, ఆదిపురుష్… చెప్పిన తేదీలకు విడుదల కాలేదు. ఈ పరంపర కొనసాగుతూ సలార్ కూడా ప్రకటించిన తేదీకి రావడంలో ఫెయిల్ అయ్యింది. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సలార్ రిలీజ్ లేదంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అనుమానాలు బలపరుస్తూ ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన మంచి సినిమా మీకు అందించేందుకు సలార్ రిలీజ్ ఆలస్యం అవుతుంది. కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తాం అన్నారు.
సలార్ విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల సంతృప్తి చెందని ప్రశాంత్ నీల్ మరింత సమయం తీసుకుంటున్నాడనే వాదన వినిపిస్తోంది. కారణాలు ఏమైనా సలార్ విడుదల ఎప్పుడనే చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. సలార్ సంక్రాంతి బరిలో ఉండే అవకాశం లేదు. అప్పుడు నార్త్ ఇండియాలో కలెక్షన్స్ రావంటూ ఓ వాదన ఉంది. అందుకే నవంబర్, డిసెంబర్ నెలల్లో సలార్ విడుదల ఉంటుందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది విడుదల లేదంటున్నారు. ఈ మేరకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి సమాచారం ఇచ్చారట. 2024 సంక్రాంతి లేదా మార్చి నెలలో సలార్ థియేటర్స్ లోకి వస్తుందని అంటున్నారు. అధిక శాతం సమ్మర్ కానుకగా మార్చి నెలలో రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఫ్యాన్స్ ని ఒకింత నిరాశపరిచే అంశమే. కొందరు మాత్రం అలసమైనా పర్లేదు మంచి సినిమాతో రావాలని కోరుకుంటున్నారు.
సలార్ మూవీ కెజిఎఫ్ కథలో భాగమే అని సమాచారం. సలార్ టీజర్ ఈ విషయంపై హింట్ ఇచ్చింది. అలాగే సలార్ రెండు భాగాలుగా విడుదలయ్యే సూచనలు కలవంటున్నారు. ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్న జగపతిబాబు ఇదే విషయం చెప్పారు. సలార్ 2లో నా పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శృతి హాసన్ ప్రభాస్ కి జంటగా నటిస్తుంది.