The Girlfriend Movie Review: నటీనటులు: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ , రావు రమేష్ తదితరులు.
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
ఎడిటర్: ఛోటా K.ప్రసాద్
నిర్మాతలు: విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని
వరస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించే సినిమా అంటే ప్రేక్షకులకు సహజంగానే ఆసక్తి కలుగుతుంది. దానికి తోడు గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణం అనగానే మంచి కంటెంట్ ఉంటుందనే ఆశిస్తారు ప్రేక్షకులు. చిలసౌ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 తో బోల్తా పడిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది తెలుసుకుందాం.
భూమా(రష్మిక) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన సొంత ఊరు నుండి హైదరాబాద్ కు వస్తుంది. రామలింగయ్య కాలేజ్ లో ఎమ్ ఏ. లిటరేచర్ స్టూడెంట్ గా చేరుతుంది. హాస్టల్ లో ఉంటుంది. అదే కాలేజిలో విక్రమ్(దీక్షిత్ శెట్టి) ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ లో చేరతాడు. ఒక సంఘటన వల్ల ఇద్దరికి పరిచయం జరగడం, ఇద్దరూ నెమ్మదిగా ఒకరికి ఒకరు దగ్గరవడం, కపుల్ లాగా మెలగడం చకచకా జరిగిపోతాయి. మరోవైపు దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) విక్రమ్ ను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. అంతా సాఫీగా ఉంటే స్టోరీ ముందుకు కదలదు కాబట్టి, హీరోగారికి కంట్రోలింగ్ యాటిట్యూడ్ బైట పడుతుంది.. దానివల్ల రష్మిక ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటుంది. అయితే రష్మికను హీరో తన అమ్మలాగే ఉన్నావు అంటూ పోలుస్తూ ఉండడంతో తను కూడా ఇద్దరి రిలేషన్ కు సంబంధించి ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉంటుంది. కొన్ని రోజులు గడిచేసరికి అనుకోని కారణాల వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇద్దరి రిలేషన్ కొనసాగిందా, లేదా అనేది మిగతా కథ.
పురుషాధిక్య సమాజానికి సెక్రెటరీ లాంటి హీరో, సాధారణంగా కనిపించే అమ్మాయి ప్రేమలో పడితే ఏమవుతుంది అనేది ఫస్ట్ హాఫ్ కథగా ఉంటుంది. ఇదంతా సరదాగా సాగిపోతుంది. అమ్మాయి సాధారణంగా కనిపిస్తుంది కానీ మేల్ డామినేషన్ బంధనాలు తెంచుకుని తన నిర్ణయాలు తను తీసుకోవాలని, తన నిర్ణయాలు వేరే ఎవరూ తీసుకోకూడదని భావించడంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. మొదట్లో బాయ్ ఫ్రెండ్ చేసేవన్నీ బాగున్నట్టు అనిపించినా, అదంతా ప్రేమేలే అని మనసుకు సర్దిచెప్పుకున్నా హీరోయిన్ కు ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. అదంతా కంట్రోలింగ్ యాటిట్యూడ్ అని తెలిసి బయటకు రావాలని అనుకున్నా రాలేకపోవడం, నెమ్మదిగా ధైర్యం చేసి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం వల్ల హీరో వైల్డ్ గా రియాక్ట్ కావడంతో సెకండ్ హాఫ్ పూర్తిగా డౌన్ అవుతుంది. ఇక ఈ సినిమాలో దర్శకుడు రాహుల్ స్త్రీ స్వేచ్ఛ, మహిళా సాధికారత లాంటి బహు కఠిన సిద్దాంతాలను చర్చించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఫిలాసఫీలు రెండువైపునా పదునున్న కత్తుల లాంటివి. ఈ సిద్దాంతాలకు అసలు అడ్డమే చెప్పకూడదు అనే ప్రస్తుత సమాజ ధోరణి, సుప్రీం కోర్టు ఈ విషయంలో తీర్పులు ఇస్తున్న ధోరణి ఈ కథ ద్వారా రిఫ్లెక్ట్ అయింది. అమ్మాయిలు ఏం చేసిన కరెక్ట్.. కాలేజి హాస్టల్ లో ఇద్దరు అడల్ట్స్ అంగీకార పూర్వకంగా ఏమి చేసినా తప్పులేదు అనే సీన్ కూడా ఒకటి పెట్టారు. టికెట్ కొని చూసేవాళ్ళకు మాత్రం ఇవన్నీ మాకవసరమా అనిపించే అవకాశాలే ఎక్కువ. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్వయంగా ఒక పాత్రలో నటించి స్త్రీ స్వేచ్ఛ గురించి మోతాదు మించకుండా అయినా తన సిద్ధాంతాలను వివరించడం సాహసమనే చెప్పాలి.
ఒకరకంగా చూస్తే ఇదో ఫెమినిజం క్లాసు అనుకోవచ్చు. మేధావులకు నచ్చుతుందేమోగానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం కష్టమే. ఈ కథ ఒక పుస్తకంలాగా నవలలాగా ఓకె కానీ సినిమాగా మెప్పించడం మాత్రం కష్టం.. ముఖ్యంగా ఈ ఫెమినిజం క్లాసు వల్ల సెకండ్ హాఫ్ చాలా వీక్ గా, డల్ గా మారిపోయింది. ఈ క్లాసుల సంగతి పక్కన పెడితే హేషమ్ అబ్దుల్ వహాబ్ నేపథ్య సంగీతం బాగుంది. రెండు పాటలు కూడా బాగున్నాయి. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ ఈ కాలేజీ థీమ్ కు తగ్గట్టుగా ట్రెండీగా ఉంది. రష్మిక నటన చాలా బాగుంది. దీక్షిత్ కూడా పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ గా చక్కగా నటించాడు. అను ఇమ్మాన్యుయేల్ పాత్ర చిన్నదే అయినా బాగుంది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. ఆకట్టుకోని డ్రామా
2. రొటీన్ కథనం
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. రష్మిక, దీక్షిత్ ల నటన
2. నేపథ్య సంగీతం, రెండు పాటలు
ఫైనల్ వర్డ్: ఫెమినిజం క్లాసు
రేటింగ్: 2.25/5