Kavitha: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని ఈడీ రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది. సంక్రాంతి పండుగ సంబురాల్లో ఉన్న కవితకు నోటీసులు రావడంతో అంతా షాక్ అయ్యారు. విచారణకు వెళ్లాలా వద్దా అని గులాబీ భవన్‌లో చర్చోపచర్చలు జరిగాయి. కవిత కూడా తన ఆంతరంగికులతో మంతనాలు జరిపారు. చివరకు విచారణకు రావడం లేదని ఈడీకి లేఖ రాశారు. ఇందుకు ఆమె ఓ కారణం చూపారు. తాను వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున అది తేలేవరకు విచారణకు రానని తెలిపారు.
తెగించిందా..
అయితే.. సుప్రీం కోర్టు విచారణను అడ్డం పెట్టుకొని తప్పించుకోవడం చిన్న అంశం. ఎందుకంటే ఆమె సుప్రీం కోర్టులో వేసిన కేసు కేవలం రాత్రిపూట విచారణ చేయడంపైనే. ఈడీ ఇప్పుడు పగటి పూట విచారణ చేయవచ్చు. అది విచారణకు వెళ్తే తెలుస్తుంది. కానీ, కవిత మాత్రం ఢిల్లీ సీఎం తరహాలో తెగించినట్లు కనిపిస్తోంది. ప్రజల్లో సానుభూతి రావాలంటే.. ఇప్పుడు అరెస్ట్ కావాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతు ఉండేది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ మద్దతు లేదు. కేంద్రంలోని బీజేపీ కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేయదు. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయితే.. తన ఇమేజ్ పెరగడంతోపాటు, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వస్తాయని భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత ఈడీ విచారణకు డుమ్మా కొట్టారని తెలుస్తోంది.
ఈడీ అరెస్ట్ చేస్తుందా..
ఇదిలా ఉంటే కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందా అన్నది అస్పష్టమే. ఎందుకంటే.. ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నా.. విచారణ తర్వాతనే అరెస్ట్ చేస్తుంది. అందుకే విచారణకు పిలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా అందుకే విచారణకు రమ్మంటుంది. ఉప ముఖ్యమంత్రి విచారణకు హాజరై తర్వాత అరెస్ట్ అయ్యారు. దాదాపు ఆరు నెలలుగా జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ సీఎంకు ఇప్పటికే నాలుగుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఏవేవో కారణాలు చూపి ఆయన తప్పించుకుంటున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్‌కు కూడా మనీలాండరింగ్ కేసులో ఏడుసార్లు నోటీసులు ఇచ్చింది. ఆయన కూడా విచారణకు వెళ్లడం లేదు. వీరి బాటలోనే కవిత నడవాలనుకుంటోంది. అరెస్ట్ కావడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు పెరుగతాయని, అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా కూడా ప్రొజెక్ట్ చేసుకోవచ్చని భావిస్తున్నారని విశ్లేషకుల అంచనా.