Krishna- Jayaprada: ‘సూపర్’స్టార్ కృష్ణతో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయ నిర్మల.. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన తొలి సినిమా సాక్షి. విజయ నిర్మల తర్వాత అత్యధిక సినిమాలు కృష్ణతో చేసిన నటి జయప్రద. 45 చిత్రాల్లో నటించిన ఘనత జయప్రదది. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఒక హీరోయిన్ ఓ హీరోతో అన్ని చిత్రాల్లో నటించడం అసాధ్యం. ఆ క్రెడిట్ జయప్రదకే దక్కింది. పైగా వారిద్దరిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కూడా.

జయప్రదకు ఫుల్ సపోర్టు..
కొత్తగా పరిశ్రమలోకి అడుగు పెట్టె ఏ హీరోయిన్‌కు అయినా హీరో సపోర్ట్ చాలా అవసరం. అలా పరిశ్రమలోకి జయప్రద ఎంటర్ అయినప్పుడు కృష్ణ ఆమెకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. బాపు దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో కృష్ణ సరసన తొలిసారిగా నటించారు జయప్రద. అందులో ఆమె అచ్చం కుందనపు బొమ్మలా కనిపించారు. కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ తర్వాత కృష్ణ, జయప్రద ‘మనవూరి కథ సినిమాలో నటించారు. ఇది కూడా హిట్ కాలేదు. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఈనాటి బంధం ఏ నాటిదో’ సినిమా విజయవంతం అయింది. అయినా కృష్ణ అభిమానుల్లో వెలితి. ఏదో తెలియని అసంతృప్తి ఉండేది. నిర్మాత డుండి అది గమనించారు. కృష్ణ, జయప్రదను గ్లామర్ జంటగా చూపించాలని ‘దొంగలకు దొంగ’ చిత్రం తీశారు. కృష్ణ, జయప్రద హుషారైన పాత్రల్లో నటించి ప్రేక్షకులకు ముఖ్యంగా అభిమానులకు పూర్తి సంతృప్తి కలిగించారు. అంతవరకూ జయప్రదను కంటతడి పెట్టించే బరువైన పాత్రల్లోనే జనం చూశారు. దొంగలకు దొంగ చిత్రంలో ఆమె గ్లామర్ తారగా మెరిసేసరికి అంతవరకూ ఆమె మీదున్న ఇమేజ్ వెలవెల పోయింది.
చలాకీ చిత్రాలు..
ఆ తర్వాత కృష్ణ, జయప్రద చలాకితనం అల్లరి బుల్లోడు చిత్రాన్ని నిలబెట్టింది. కథాబలం. లేకపోయినా వీరిద్దరి వల్లే ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఈ సినిమాలోని ‘చుక్కల తోటలో ఎక్కడున్నావో.. పక్కకు రావే సిరిమల్లె పువ్వా’ పాట బాగా పాపులర్ అయింది. ఇక కృష్ణ, జయప్రద కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రం ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాని అప్పటికే అనేకసార్లు చూేససిన అభిమానులు ఇందులోని ఇదుగో తెల్ల చీర.. ఇవిగో మల్లెపూలు’ పాట కోసమే మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చేవారు. ఆ పాట పూర్తికాగానే వారు ఆనందంతో బయటకు వచ్చేసేవారు.

విజయ నిర్మల తర్వాత జయప్రదే..
బ్లాక్ అండ్ వైట్ చిత్రాల వరకు కృష్ణ, విజయనిర్మలది తిరుగులేని జంట. అయితే కలర్ సినిమాల నిర్మాణం ముమ్మరం అయిన 80వ దశకంలో పాపులర్ జంటగా కృష్ణ, జయప్రద పేరొందారు. అప్పటికి ఒక పక్క కృష్ణ, శ్రీదేవి జంట జోరుగా సినిమాలు చేస్తున్నప్పటికీ, కృష్ణ, జయప్రద జంటకు కూడా జనం జేజేలు పలికారు. అయితే ఒకటి రెండు చిత్రాల్లో కృష్ణకు చెల్లెలిగా జయప్రద నటించడం ఆ రోజుల్లో అభిమానులకు నచ్చలేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం చంద్రవంశం. తన తమ్ముడు రాంకుమార్ హీరోగా నటించిన చిన్న చిత్రం ప్రారంభోత్సవానికి కృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో క్లాప్ కొట్టించారు జయప్రద. ఆయనంటే అంత అభిమానం జయప్రదకు. ఆ తర్వాత పదేళ్ల అనంతరం భానుమతితో కృష్ణ నటించిన మరో చిత్రం గడసరి అత్త సొగసరి కోడలు. ఇందులో వీరిద్దరూ తల్లీ కొడుకులుగా నటించారు. సొగసరి కోడలిగా శ్రీదేవి నటించారు. వినోదభరింతగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కట్టా సుబ్బారావు దర్శకుడు. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు మహిళా ప్రేక్షకుల్ని అలరించాయి.