YS Sharmila: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు కెసిఆర్ ట్రీట్మెంట్ అంటే ఏమిటో తెలిసి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో కెసిఆర్ కు బాగా తెలుసు. ఆయన మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం కేసీఆర్ కు రాలేదు. అటు జగన్ మీద అవకాశం లేదు.. ఎప్పుడో లొంగిపోయాడు.. కానీ అతడి సోదరి వైయస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టి, తాను తెలంగాణని కోడలినని పరిచయం చేసుకుంటూ ఇక్కడి రాజకీయాల్లో ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర వరకైతే బాగానే ఉండేది.. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబానికి గట్టిగా తగులుతున్నాయి.

లోతుల్లోకి వెళ్లి మరీ విమర్శలు చేస్తున్నారు
ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేసిన షర్మిల… హుస్నాబాద్ లోకి ఎంటర్ అయ్యారు.. వాస్తవానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కెసిఆర్ అత్తగారిల్లు ఉంది. కానీ ఆ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఆ మాటను కూడా ఉటంకిస్తూ నేరుగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇక షర్మిల పాదయాత్రకు టిఆర్ఎస్ నాయకులు అడ్డంకులు సృష్టించడం ఇది తొలిసారి కాదు. నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో పాదయాత్రలు చేస్తున్నప్పుడు మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు ఆమెను అడ్డుకున్నారు. ఖమ్మంలో కూడా పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు కూడా ఆమె యాత్రకు అడ్డంకులు సృష్టించారు. విడతలవారీగా సాగుతున్న ఆమె యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న విమర్శలు దాటిగా ఉంటున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన బలమైన పిఆర్ టీం ఏర్పాటు చేసుకొని, అక్కడి స్థానిక పరిస్థితులు తెలుసుకుంటున్నారు. వెంటనే అక్కడి స్థానిక ప్రజాప్రతినిధిపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ కూడా స్థానిక టిఆర్ఎస్ నాయకుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు.
రివెంజ్ తీర్చుకుంటున్నారా
ఈ కథనం ప్రారంభంలో చెప్పినట్టు అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రశేఖర రావును ఒక ఆట ఆడుకున్నారు. ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆకర్షించే రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జగన్ ముందుగానే కెసిఆర్ కు లొంగిపోయారు. అందుకే కేసిఆర్ కు వైఎస్ ఫ్యామిలీ మీద రీవెంజ్ తీర్చుకునే అవకాశం ఇలా వచ్చింది. అందుకే షర్మిలపై నిన్న నర్సంపేట లోని శంకర్ తండా వద్ద టిఆర్ఎస్ నాయకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అక్కడ పాదయాత్ర చేస్తున్న క్రమంలో షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. దీనిని టిఆర్ఎస్ నాయకులు ఖండించారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే షర్మిల నిరాకరించారు. ఇదే క్రమంలో షర్మిల తన పాదయాత్రలను నిలిపివేయాలని, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఏసిపి సంపత్ రావు కోరినప్పటికీ ఆమె నిరాకరించారు. పాదయాత్ర శంకర్ తండా వద్దకు రాగానే టిఆర్ఎస్ నాయకులు ఒక వాహనంపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించారు. షర్మిలపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ అలజడిలో షర్మిల పెదవికి గాయమైంది. ఈ ఘటన తర్వాత ఆమెను పోలీసులు హైదరాబాద్ తరలించారు.

హైదరాబాదులో నాటకీయ పరిణామాలు
అయితే తనపై జరిగిన దాడికి నిరసనగా షర్మిల చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు.. నిన్న ధ్వంసమైన కారును నడుపుకుంటూ పంజాగుట్ట మీదుగా ప్రగతి భవన్ వెళ్లే ప్రయత్నం చేశారు.. అయితే ఆమెను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఆమె ఎంతకు వెనక్కి తగ్గకపోవడంతో క్రేన్ సహాయంతో కారును వెనక్కి మళ్ళించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇన్నాళ్లు షర్మిల పాదయాత్రను తేలికగా తీసుకున్న టిఆర్ఎస్ నాయకులు… ఇప్పుడు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ముందు ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.