Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ కి ఒకప్పుడు బారి క్రేజ్ ఉండేది. కార్తీకదీపం తర్వాత స్టార్ మా ప్రేక్షకులు ఇష్టపడిన సీరియల్ గుప్పెడంత మనసు అని చెప్పొచ్చు. ముఖ్యంగా యూత్ లో రిషి – వసుధారల జంటకు బీభత్సమైన ఆదరణ లభించింది. సీరియల్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రధాన పాత్రలైన రిషి – వసుధార. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ప్రేమికులు అంటే రిషి – వసుధార వలె ఉండాలి అనుకునేంతగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు.
అయితే కొన్ని నెలలుగా సీరియల్ లో మెయిన్ లీడ్ రిషి పాత్ర చేస్తున్న ముకేశ్ గౌడను కనిపించకుండా చేశారు. అర్థాంతరంగా సీరియల్ కి ప్రాణమైన రిషి క్యారెక్టర్ ని చంపేశారు. రిషి లేకపోవడంతో వసుధార పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వసు పాత్రకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అలాగే వసుధార పాత్రకు పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండటం లేదు. నిజానికి రిషి లేని వసు ప్రాణాలతో ఉండదు. నేను ఉన్నానంటే రిషి బతికి ఉన్నట్టే .. ఎలాగైనా వెతికి తీసుకొస్తాను అని చెప్పిన వసుధార అటువైపుగా అడుగు వేయనే లేదు.
కనీసం రిషి కోసం వెతుకుతున్నట్లు సీరియల్ లో చూపించడం లేదు. ఏదో నాలుగు డైలాగులు .. కాలేజ్ ఎండీగా ఉన్నందుకు మీటింగ్ అంటూ కాస్త బిల్డప్ సీన్స్ తో లాగించేస్తున్నారు. అంతకు మించి వసుధార రోల్ కి సీరియల్ లో ప్రాధాన్యత లేదు. ప్రస్తుతం కథ మొత్తం మను, మహేంద్ర అనుపమ చుట్టూ తిరుగుతుంది. రిషి లేకపోవడంతో వసుధార పాత్ర ఏదో ఉందంటే ఉంది అన్నట్టు లాగించేస్తున్నారు.
రిషి పాత్ర లేకపోవడంతో వసుధార పాత్రకు వెయిట్ తగ్గింది. బుల్లితెర ప్రేక్షకులు దీన్ని జీర్ణించుకోలేకున్నారు. ఈ క్రమంలో మరో వాదన తెరపైకి వచ్చింది. త్వరలో వసుధార పాత్రను కూడా గుప్పెడంత మనసు సీరియల్ నుండి లేపేయవచ్చని అంటున్నారు. వసుధార కూడా లేకుండా రిషి గుర్తుకు రాడు. లేదంటే మొత్తంగా సీరియల్ కి శుభం కార్డు వేసేయవచ్చని బుల్లితెర ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.