Kavitha Kalvakuntla: జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత జనంలోకి వచ్చేసారు. పార్టీ ఏర్పాటు చేయకుండానే జాగృతి పేరుతో ఆమె ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తన మెట్టినిల్లు నిజామాబాద్ ప్రాంతం నుంచి ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరూ ఊహించినట్టుగానే గులాబీ పార్టీపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read: మరో యాక్సిడెంట్.. ఈ బస్సులకు ఏమైంది?
“ఎప్పటికైనా ఈ గడ్డలోనే నేను కలిసి పోతాను. 20 సంవత్సరాలుగా కేసీఆర్, బీఆర్ఎస్ కోసం పనిచేశాను. కుట్రలు చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి వెతుక్కునే పనిలో ఉన్నాను. నిజామాబాద్ ప్రాంతంలో నా ఓటమి కుట్రనా? కాదా? ప్రజలు ఆలోచించాలి. ఎన్ని అవమానాలు జరిగిన మా నాన్న, భారత రాష్ట్ర సమితి మీద ఉన్న ప్రేమతో భరించాను. ఎన్ని రోజులపాటు కేసీఆర్ గారి నీడలో ఉన్నాను. ఇప్పుడు ఆ నీడ నుంచి నన్ను బయట పడేశారని” కవిత ఆరోపించారు.
కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్నటిదాకా అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో గులాబీ పార్టీ ఆరోపణలు చేసింది. మంత్రుల వ్యవహారాలను కథలుగా బయటపెట్టింది. కానీ ఇప్పుడు కవిత తన తండ్రి పార్టీ గురించి అసలు విషయాలు చెబుతోంది. పైగా తనను ఓడించారని విమర్శిస్తోంది. వాస్తవానికి కెసిఆర్ కుమార్తె జోలికి రావాలంటే పార్టీలో ఎవరితరమూ కాదు. అయితే ఇదంతా తన కుటుంబంలోని కొంతమంది సభ్యులు చేశారని కవిత ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు ఆమె కట్టుబడి ఉంటానని ఇటీవల స్పష్టం చేసింది. ఈ ప్రకారం చూసుకుంటే కవిత కుటుంబాల్లోని కీలకమైన వ్యక్తులే ఆమె ఓటమికి కారణమయ్యారని తెలుస్తోంది. అయితే కేవలం తన ఓటమి గురించి మాత్రమే ఆగిపోనని.. ఇంకా సంచలన విషయాలను బయటపెడతానని కవిత చెబుతోంది.
గులాబీ పార్టీలో ఇన్ని రోజుల వరకు ఏం జరిగింది? తనను ఎవరు ఇబ్బంది పెట్టారు? ఎవరి కుట్రలకు తాను బలయింది.. అనే విషయాలను కవిత వెల్లడిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే నిన్నటి వరకు అంతర్గత ఉక్కపోతతో ఇబ్బందిపడిన కాంగ్రెస్ పార్టీకి.. కవిత చేసిన విమర్శలు ఒక్కసారిగా రిలీఫ్ ఇచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కాగిత చేసిన ఆరోపణలకు బలంగా ప్రచారం చేస్తోంది.