KCR: గులాబీ అధినేత కేసిఆర్ మొత్తానికి ఫామ్హౌస్ నుంచి బయటికి వచ్చారు. శనివారం రాత్రి హైదరాబాదులోని నంది నగర్ లో తన నివాసానికి వచ్చారు. చాలా రోజుల తర్వాత కెసిఆర్ బయటికి రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం నెలకొంది. కెసిఆర్ ఇప్పటికిప్పుడు బయటకు రావడం వెనుక బలమైన కారణం ఉంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బయటకు కనిపించడం అత్యంత అరుదుగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం తర్వాత ఆయన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైపోయారు. గులాబీ పార్టీ పాతిక సంవత్సరాల పండుగకు ఆయన వరంగల్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. ఇటీవల తన మేనల్లుడు హరీష్ రావు తండ్రి చనిపోతే కేసీఆర్ బయటికి వచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ గా కెసిఆర్ పేరు పేర్కొన్నప్పటికీ.. ఆయన బయటికి రాలేదు.
తనను కలిసే నేతలతో మాత్రమే కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు తో అప్పుడప్పుడు సమావేశం అవుతున్నారు.. ఎన్నికల్లో, వివిధ సందర్భాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత కెసిఆర్ బయటికి వచ్చారు. ఆదివారం భారత రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కెసిఆర్ సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ సమావేశం మొదలవుతుంది. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈనెల 19 నిర్వహించాలని అనుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు 19 వరకు కొనసాగిన నేపథ్యంలో ఎంపీలు రారని భావించిన కేసీఆర్.. దానిని 21 వరకు వాయిదా వేశారు. చాలా రోజుల తర్వాత విస్తృత సమావేశాన్ని పార్టీ నిర్వహిస్తూ ఉండడం.. దీనికి కేసీఆర్ హాజరవుతుండడంతో విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశంలో అనేక అంశాలను చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానమైన చర్చ జరుగుతుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోలవరం నల్లమల సాగర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కూడా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా నీటితో సర్దుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన తీరును గులాబీ పార్టీ తప్పుపడుతోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు 90 టీఎంసీల నీటి కోసం పోరాటం చేసామని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకు ఇలా ఒప్పుకుంటుందని గులాబీ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని గులాబీ అధినేత భావించినట్టు సమాచారం. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి తేదీలను మాత్రం ప్రకటించకపోవచ్చని.. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయని.. అందువల్లే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. చాలాకాలం తర్వాత కెసిఆర్ బయటికి వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరే అవకాశం లేకపోలేదని… మరి దీనిని ముఖ్యమంత్రి ఎలా స్వీకరిస్తారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.