Barc Ratings
Barc Ratings: గత ఐపీఎల్ సీజన్ లలో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. 2023లో అయితే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో హైదరాబాద్ ఆటతీరు, ఆటగాళ్ల పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ రూ. 20 కోట్లు ఖర్చు చేసి కమిన్స్ ను కొనుగోలు చేసింది. దీంతో హైదరాబాద్ ఆట తీరు మారింది. ఫైనల్ వెళ్ళింది. దురదృష్టం కొద్దీ ఓడిపోయింది.. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ లో సన్ రైజర్స్ ను విజేతగా నిలిపేందుకు కావ్య ఇప్పటినుంచి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎవర్ని రిటైన్ చేసుకోవాలి? జట్టును ఏ విధంగా పునర్నిర్మించాలి? అనే దిశగా ఆలోచనలు చేస్తోంది.. అన్ని బాగుంటే వచ్చే సీజన్లో హైదరాబాద్ విజేతగా ఆవిర్భవిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఎటొచ్చీ సన్ గ్రూప్ లో సన్ రైజర్స్ కంటే పెద్దదైన జెమిని టివి భవితవ్యమే ప్రమాదంలో చిక్కుకుంది.
వాస్తవానికి జెమిని టీవీకి, కావ్య మారన్ కు సంబంధం ఏంటనే ప్రశ్న మీకు రావచ్చు. జెమినీ టీవీ సన్ గ్రూపులో ఒక సంస్థ. పైగా ఇది ఆమె తండ్రికి చెందినది. ఆమె తండ్రికి ఒక్కతే వారసురాలు కావడంతో.. భవిష్యత్తు కాలంలో దీనికి ఓనర్ ఆమెనే అవుతుంది. గతంలో తెలుగునాట అత్యధిక టిఆర్పి రేటింగ్స్ నమోదు చేసిన ఛానల్ గా జెమినీ కొనసాగేది. సన్ గ్రూపులో అత్యధిక లాభాలు తెచ్చే సంస్థగా జెమినీ టీవీ కి పేరు ఉండేది. మొదట్లో కళానిధి మారన్ దీనిని పట్టించుకునేవాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ దీనిని సన్ గ్రూప్ యాజమాన్యం పట్టించుకోవడం మానేసింది. కేవలం తమిళనాట సన్ ఛానల్ మీదే కళానిధి మారన్ ఫోకస్ చేశారు. ఇంకా కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడంతో.. వాటితోనే ఆయనకు సరిపోతోంది.
కళానిధి మారన్ కు కావ్య మారన్ ఒకటే కూతురు. చిన్నప్పటినుంచి ఆమెకు ఒంటరితనం అంటే ఇష్టం. పెద్దగా ఎవరితోనూ కలవదు. అందుకే ఆమెకు ఏదో ఒక వ్యాపకం ఉంటుందనే ఉద్దేశంతో సన్ గ్రూప్ లో సన్ మ్యూజిక్, సన్ ఎఫ్ఎం బాధ్యతలను అప్పట్లో అప్పగించారు. వాటిని గాడిన పెట్టింది. ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్ క్రికెట్ జట్టును సన్ రైజర్స్ జట్టుగా మార్చింది. 2016 లో విజేతగా, 2018 లో రన్నరప్ గా, 2024 లోనూ రన్నరప్ గా నిలిపింది..
సన్ మ్యూజిక్, సన్ ఎఫ్ఎం ను ఎలాగైతే గాడిన పెట్టిందో.. రేటింగ్స్ లేక, ఆరో స్థానంలో కొట్టుమిట్టాడుతున్న జెమినీ చానెల్ ను వృద్ధిలోకి తీసుకురావాలని, ఆ ఛానల్ ఉద్యోగులు కోరుతున్నారు. నాసిరకమైన కార్యక్రమాలు.. సినిమాలు కొంటున్నప్పటికీ.. వాటికి అంతగా ఆదరణ దక్కకపోవడం.. పోటీ చానల్స్ నాణ్యమైన సీరియల్స్ నిర్మిస్తుండడం.. వంటివి జెమినీ టీవీ ని దెబ్బ కొడుతున్నాయి. తాజాగా విడుదలైన బార్క్ రేటింగ్స్ లో స్టార్ మా ఛానల్ రూరల్ ఏరియాలో 740, అర్బన్ ఏరియాలో 757, జీ తెలుగు రూరల్ ఏరియాలో 483, అర్బన్ ఏరియాలో 523, ఈటీవీ తెలుగు రూరల్ ఏరియాలో 255, అర్బన్ ఏరియాలో 254, స్టార్ మా మూవీస్ రూరల్ ఏరియాలో 237, అర్బన్ ఏరియాలో 236, జెమిని మూవీస్ రూరల్ ఏరియాలో 210, అర్బన్ ఏరియాలో 215 రేటింగ్స్ తో కొనసాగుతున్నాయి. అయితే ఇందులో జెమినీ టీవీ మరింత దారుణంగా రూరల్ ఏరియాలో 189, అర్బన్ ఏరియాలో 189, స్టార్ మా గోల్డ్ రూరల్ ఏరియాలో 127, అర్బన్ ఏరియాలో 118, స్టార్ మా మ్యూజిక్ రూరల్ ఏరియాలో 103, అర్బన్ ఏరియాలో 98, ఈటీవీ సినిమా రూరల్ ఏరియాలో 75, అర్బన్ ఏరియాలో 66 రేటింగ్స్ తో కొనసాగుతున్నాయి..
వాస్తవానికి స్టార్ మా, జీ తెలుగు కంటే జెమిని టీవీకి బలమైన నెట్వర్క్ ఉంది. కానీ దానిని ఆ చానల్ సరిగా ఉపయోగించుకోలేకపోతోంది. ఫలితంగా రేటింగ్స్ విషయంలో రోజురోజుకు దిగువకు పడిపోతోంది. అయితే ఈ పతనం ఇక్కడి వరకే ఉంటుందా.. ఇంకా పడిపోతుందా అనేది మునుముందు రోజుల్లో తెలియనుంది. అంతదాకా రాకముందే కావ్య జెమినీ టీవీని పట్టించుకోవాలని.. దానికి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని అందులో పని చేస్తున్న ఉద్యోగులు కోరుతున్నారు. సన్ రైజర్స్, సన్ ఈస్టర్న్ కేఫ్, సన్ ఎఫ్ఎం, సన్ మ్యూజిక్ వంటి వాటితో తీరిక లేకుండా ఉన్న కావ్య మారన్.. జెమిని పట్టించుకుంటుందా.. దానిని గాడిలో పెడుతుందా.. అనేది వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Gemini tv in bark ratings is going down day by day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com