AP Rains: రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం అమాంతం తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి విపరీతమైన పొగ మంచు పడుతోంది. ఆపై చలిగాలులు తీవ్రతరం అయ్యాయి. అయితే అదే సమయంలో వర్షాలు సైతం వెంటాడుతున్నాయి. ఒకదాని తరువాత ఒకటి వరుసగా అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు రావడంతో ఏపీవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సమీపంలో.. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయువ్యదిశగా తమిళనాడు తీరం వైపు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* మరింత బలపడే అవకాశం
అయితే 15 తరువాత రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే రేపు పొడి వాతావరణం కొనసాగుతుందని.. ఎల్లుండి నుంచి వర్షాలు ప్రారంభం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాకు వర్ష సూచన ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు తో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు.
* 17న సైతం..
అటు మంగళవారం సైతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాలు పడనుండడంతో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.