Tanya Ravichandran: హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ ప్రస్తుతం టాలీవుడ్ పై పడింది. అవకాశాల కోసం ప్రత్యేక పీఆర్వో టీమ్ ను పెట్టుకుని పనిలో పనిగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. పైగా ఆమె నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమా రిలీజ్ కి కూడా సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. అసలుకే కార్తికేయ వరుస ప్లాప్స్ లో ఉన్నాడు. అందుకే ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు.

అంచనాలను పెంచడానికి చిత్రబృందం ప్రమోషన్స్ ను ప్లాన్ చేసింది. ఎలాగూ తాన్యా రవిచంద్రన్ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి బాగా ఉత్సాహం చూపిస్తోంది కాబట్టి.. ఆమెతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే, తాన్యా మాత్రం సినిమా గురించి కంటే.. కూడా తన గురించే ఎక్కువ ప్రమోట్ చేసుకుంటుంది.

మీడియా మిత్రులు ఏ ప్రశ్న అడిగినా ఆమె తన పర్సనల్ విషయాలే ఎక్కువ చెబుతుంది. ‘రాజా విక్రమార్క’ సినిమా ఛాన్స్ మీకు ఎలా వచ్చింది ? అని అడిగితే.. తాన్యా రవిచంద్రన్ సమాధానం ఈ విధంగా సాగింది. ‘అసలు నేను సినిమాల్లోకి ఎలా వచ్చాను అంటే.. నేను అప్పుడు పీజీ చేస్తున్న సమయంలో ఓ సినిమా కో డైరెక్టర్ నన్ను చూసి నా ఫోటోలను తీసి కొంతమంది డైరెక్టర్లకు పంపాడు.

ఆ ఫోటోలు కారణంగా తమిళ పరిశ్రమ నుంచి నాకు అవకాశాలు వచ్చాయి. అలా తమిళంలో వెంట వెంటనే మూడు సినిమాలు చేయడం జరిగింది. అలా సినిమాల్లోకి వచ్చాను’ అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ‘సరే.. హీరో కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ?’ అని అడిగితే.. ‘నేను ఈ సినిమాలో చాలా సహజ పాత్రలో కనిపిస్తాను.

నా నటన అందరికీ నచ్చుతుంది. కార్తికేయ కూడా సెట్ లో ఎప్పుడూ నా నటనను మెచ్చుకుంటూ ఉండేవాడు. కార్తికేయతో నాకు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నా.. నాతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ను మాత్రం కార్తికేయ బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు’ అంటూ ఇలా తనదైన శైలిలో తాన్యా చెబుతూ పోయింది తప్ప, సరైన సమాధానాలు మాత్రం చెప్పలేదు.