Tanikella Bharani: ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే నటులు చాలా కొద్దిమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు తనికెళ్ల భరణి. నటుడుగానే కాకుండా డైలాగ్ రైటర్ గా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు తనికెళ్ల భరణి. ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించాడు.
ఇక ప్రస్తుతం తనికెళ్ల భరణి శ్రీకాంత్ అద్దాల దర్శకత్వంలో వస్తున్న పెదకాపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా గురించి అలానే ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
‘ఈ మధ్య కాలంలో చాలా వరకూ తండ్రి పాత్రలే చేశాను. అవన్నీ రెగ్యులర్‌గా ఉండే పాత్రలే. కానీ ‘పెదకాపు-1’లో చాలా భిన్నమైన పాత్ర చేశాను. కథలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అది. సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి పాత్ర అనుకోవచ్చు. ఇందులో నాది స్కూల్ మాస్టర్ పాత్ర. స్కూల్ టీచర్‌కి సమాజంపై ఒక అవగాహన ఉంటుంది. నా పాత్ర దర్శకుడి వాయిస్‌ని రిప్రజంట్ చేస్తుంది. ప్రేక్షకుల తరఫున ప్రశ్నించే పాత్ర. చాలా అద్భుతమైన వేషం. చాలా రోజులు పని చేసిన వేషం. ఈ చిత్రంలో అన్ని ప్రధాన పాత్రలతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప పాత్రల్లో ఇదీ ఒకటి. నా కెరీర్‌లో ఒక జ్ఞాపకంగా నిలిచిపోయే పాత్ర ఇది’ అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఆయన కెరియర్ లో గుర్తుంది పోయే పాత్రలను కూడా షేర్ చేసుకున్నారు తనకెల్ల భరణి గారు. ‘నా కెరీర్‌లో గుర్తుపెట్టుకునే పాత్రలు కనీసం ఒక 30 ఉంటాయి. మాతృ దేవో భవ, లేడీస్ టైలర్, కనకమహాలక్ష్మీ రికార్డింగ్స్, శివ, అతడు, మన్మథుడు ఇలా చాలా సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ‘గద్దలకొండ గణేష్’లో చేసింది చిన్న పాత్రే కానీ ఎందరినో కదిలించింది. ఆ సినిమా చూసి ఎంతో మంది సహాయ దర్శకులు ఫోన్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు తనికెళ్ల భరణి.