కత్తి మహేష్ అజాగ్రత్తే ప్రాణాల మీదకు తెచ్చిందని చెబుతున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు స్నేహితుడు సురేష్ సీటు బెల్టు పెట్టుకోవడంతో ఆయనకు గాయాలు కాలేదు. మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకవేళ ఆయన బెల్టు పెట్టుకుంటే ఇంతలా గాయపడి ఉండే వారు కాదని తెలుస్తోంది. అయితే మెరుగైన చికిత్స కోసం మహేష్ ని చెన్నైకి తరలించారు.
తరువాత కంటి, బ్రెయిన్, ముఖంపై తగిలిన గాయాలకు చికిత్స చేశారు. జూన్ 26న వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. పలు చికిత్సల తరువాత బ్రెయిన్ కు ఎలాంటి గాయాలు కాలేదు. రక్తస్రావం కూడ జరగలేదనే విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. చెన్నైలోని అపోలోలో చికిత్స కొనసాగుతున్న సమయంలో మహేష్ ఊపిరితిత్తుల్లోకి అనూహ్యంగా రక్తం, నీరు చేరడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.
సమస్యను గుర్తించిన వైద్యులు తగిన వైద్యం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో మహేష్ చనిపోవడం అందరిని బాధకు గురి చేసింది. అయితే కత్తి మహేష్ మరణంపై సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మరణానికి ముందు వెంటిలేటర్ తొలగించారు? ఆక్సిజన్ అందించడం ఆపేశారనే విషయం చర్చకు వస్తోంది. ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగింపుపై వైద్యులు నివేదిక ఇస్తే గానీ అనుమానాలకు తెరపడదనే విషయం ప్రస్తావిస్తున్నారు.