The Kerala Story OTT: ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కేరళ స్టోరీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే పొలిటికల్ కాంట్రవర్సీ రాజేసింది. కొన్ని ఏరియాల్లో ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన అడ్డుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మాదిరి ప్రాపగాండా మూవీ అంటూ విమర్శించారు. కేరళ రాష్ట్రంలో ప్రేమ పేరిట లవ్ జిహాద్ ఉచ్చులోకి లాగుతున్నారని ఆ చిత్ర ప్రధాన కథాంశం.
హిందూ క్రిస్టియన్ మతాలకు చెందిన అమ్మాయిలను ముస్లిం యువకులు కుట్రపూరితంగా ప్రేమిస్తున్నారు. అనంతరం వారిని విదేశాలకు తరలించి టెర్రరిస్ట్స్ గా మారుస్తున్నారని చెప్పారు. ఒక్క కేరళ రాష్ట్రంలో 30వేల మంది యువతులు లవ్ జిహాద్ కి బలయ్యారని ఆ మూవీలో చెప్పారు. ఆదా శర్మ లవ్ జిహాద్ కారణంగా టెర్రరిస్ట్స్ బారిన పడిన అమ్మాయి పాత్ర చేసింది.
విమర్శల మధ్య ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. ఈ చిత్రంలో నటించిన ఆదా శర్మ సైతం వ్యతిరేకత ఎదుర్కొంది. ది కేరళ స్టోరీ చిత్రాన్ని సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ మూవీ విడుదలై రెండు నెలలు కావస్తుంది. అయినా ఓటీటీలో రాలేదు.
జీ 5 లో జూన్ 23 నుండి స్ట్రీమింగ్ అంటూ ప్రకటించారు. తేదీ ముగిసినా ది కేరళ స్టోరీ అందుబాటులోకి రాలేదు. విచిత్రంగా ది కేరళ స్టోరీ ఓటీటీ హక్కులు కొనేందుకు సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. వివాదాల నేపథ్యంలో కొనాలనుకున్నా తక్కువ రేటుకు అడుగుతున్నారట. దాంతో కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కి నోచుకోవడం లేదట. ఓటీటీ డీల్ ముగిస్తే కానీ సినిమా అందుబాటులోకి రాదంటున్నారు.
కాగా ఆదా శర్మ కెరీర్లో భారీ హిట్ గా ది కేరళ స్టోరీ నిలిచింది. తెలుగులో ఆదా హార్ట్ అటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం, కల్కి వంటి చిత్రాల్లో నటించారు. ఆమెకు కనీస గుర్తింపు దక్కలేదు. ది కేరళ స్టోరీతో ఇండియా వైడ్ ఆమె పేరు వినిపించింది.