ఎన్నో లాజిక్కులు మాట్లాడొచ్చుగాక.. ఇంకెన్నో లెక్కలు చెప్పొచ్చుగాక.. అంతిమంగా సమాజం తోడు లేకుండా ఏ మనిషీ మనుగడ సాగించలేడన్నది నిజం. నిర్వివాదం. దీన్ని గుర్తించినప్పుడే మనిషికి పరిపూర్ణత. ఇలాంటి పరిపూర్ణమైన మనుషులు మన చుట్టూ అరుదుగానే కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్.
దేశంలో ఆక్సీజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేక కొవిడ్ రోగులు ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా ఆక్సీజన్ ప్లాంటునే ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు సుక్కూ. 40 లక్షల రూపాయలతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఓ ఆక్సీజన్ ప్లాంట్ నిర్మించడానికి సిద్ధమయ్యారు.
వాస్తవానికి మొదట ఆక్సీజన్ సిలిండర్లు, కాన్ సన్ ట్రేటర్లు అందించాలని భావించారు సుకుమార్. ఇందుకోసం రూ.25 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే.. సిలిండర్లను మళ్లీ మళ్లీ నింపిస్తూనే ఉండాలి. కానీ.. అదే ఆక్సీజన్ ప్లాంట్ నిర్మిస్తే.. నిర్విరామంగా ఉత్పత్తి చేయొచ్చుకదా అని భావించారు. దీంతో.. పాతి లక్షలకు మరో 15 లక్షలు కలిపి మొత్తం 40 లక్షలతో ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమయ్యారు.
డీఓసీఎస్-80 ఆక్సీజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిత్వరగా మూడ్నాలుగు రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నారు. దీంతో.. సుకుమార్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే.. ఒక్క సుకుమార్ ఒక ప్లాంట్ నిర్మించగలిగినప్పుడు.. మిగిలిన సినిమా స్టార్లు ఎన్ని నిర్మించగలరు? రాజకీయ నాయకులు ఎన్ని నిర్మించగలరు? పారిశ్రామికవేత్తలు ఇంకెన్ని ఏర్పాటు చేయగలరు?