Jatadhara Movie Review: నటీనటులు: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ప్రదీప్ రావత్, శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల తదితరులు.
సంగీతం: రాజీవ్ రాజ్
ఛాయాగ్రహణం: సమీర్ కళ్యాణి
దర్శకత్వం: వెంకట కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్
నిర్మాతలు: ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణా అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా.
ఒక్కోసీజన్ లో ఒక్కో తరహా సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతూ ఉంటుంది. అలా చూసుకుంటే ఈమధ్య, డివోషనల్ – ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్నాయి. సక్సెస్ ట్రెండ్ ను ఫాలో అవుతూ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన జటాధర సూపర్ న్యాచురల్ – హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ జటాధరుడు ఆడియన్స్ ను మెప్పించడంలో విజయం సాధించాడా లేదా అనేది చూద్దాం.
శివ(సుధీర్ బాబు) మాడరన్ మనిషి. దెయ్యాలపై నమ్మకం ఉండదు. మనిషిలోనే భయాలే దెయ్యాలని అంటాడు. బైటకానీ, పాడుబడిన బంగళాలలో కానీ అవి లేవు అని గట్టిగా నమ్ముతాడు. తన స్నేహితులతో కలిసి దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడమే ఒక హాబీగా పెట్టుకుంటాడు. ఇలాంటి గొప్ప హేతువాది అయినప్పటికీ ఒక పీడకల మాత్రం తనకు తరచుగా దెయ్యాల గురించి హింట్ ఇస్తూ ఉంటుంది. రుద్రారం అనే ఊరిలో ఎన్నో తరాల క్రితం కొందరు తమ వద్దనున్న సంపదను ఒక చోట దాచుకుని తాంత్రిక శక్తితో నిధికి బంధనం వేస్తారు. ఆ నిధిని కాపాడుతున్న క్షుద్రదేవతే ధన పిశాచి(సోనాక్షి సిన్హా). మన హేతువాది హీరోకు ఈ క్షుద్రదేవతకు ఎందుకు వైరం ఏర్పడింది, వారి పోటీలో ఎవరు విజేతగా నిలిచారు అనేది మిగతా కథ.
సినిమా థీమ్ బాగానే ఉంది కానీ అది పేక్షకులను మెప్పించాలంటే దాన్ని హైలైట్ చేసేలా అద్భుతమైన కథనం ఉండాలి, ఆకట్టుకునే మలుపులతో నెక్స్ట్ ఏంటి అనే ఫీల్ తీసుకురావాలి. కానీ ఇక్కడ జటాధరలో అలాంటి ఆసక్తికర కథనం, సస్పెన్స్ పూర్తిగా మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ లో కథనం నీరసంగా సాగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కొంత బాగానే ఉంది అనిపించినా, ఆ ఫీలింగ్ ఎక్కువసేపు నిలవకుండా చూసుకున్నారు దర్శకులు. వీటికి తోడు కథకు అతికీఅతకని లవ్ ట్రాక్, ఐటెమ్ సాంగ్ మన సహనానికి పరీక్ష పెడుతుంటాయి. పొరపాటున కూడా ఎమోషన్ తో ప్రేక్షకులు కనెక్ట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. దీంతో బలవంతంగా ప్రయత్నించినా సినిమా కథతో కనెక్ట్ కాలేము. సస్పెన్స్ ఎలిమెంట్, థ్రిల్లింగ్ మొమెంట్ లేకుండా ఉండడంతో సినిమా భారంగా అనిపిస్తుంది.
ఇలాంటి సూపర్ న్యాచురల్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రాణం. సినిమాను నిలబెట్టాల్సిన అంశం అదే. కానీ అదే తుస్సుమనిపించింది. దాంతో సినిమాకు రావలసిన మినిమమ్ ఫీల్ కూడా రాలేదు. ఇక పాటలు కూడా అవుట్ డెటెడ్. ఎడిటింగ్ కూడా సరిగా లేదు. సినిమాటోగ్రఫీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. స్క్రీన్ ప్లే, దర్శకత్వ లోపాలు చాలానే ఉన్నాయి.
హీరో సుధీర్ బాబు తన వంతుగా కష్టపడినట్టు కనిపిస్తుంది కానీ పాత్ర చిత్రణ బలహీనంగా ఉండడంతో తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరయింది. హీరోయిన్ దివ్య ఖోస్లా ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉన్నట్టుగా ఉంది. హీరో- హీరోయిన్ జోడీ సరిగ్గా కుదరలేదు. సోనాక్షి సిన్హా ఇంప్రెసివ్ గా లేదు. ప్రేక్షకులను భయపెట్టాల్సిన పాత్ర ఏమాత్రం భయపెట్టలేకపోయింది. దీనికి కారణం సోనాక్షి బలహీనమైన నటనకాదు.. దర్శకత్వ లోపమే.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. వీక్ కథనం, దర్శకత్వం
2. నేపథ్య సంగీతం
3. ఎడిటింగ్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. సుధీర్ బాబు నటన
ఫైనల్ వర్డ్: చూసినోళ్ళు ఫట్టు దొర
రేటింగ్: 1.5/5