Superstar: సినిమా జనానికి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ప్రేక్షకులు ఒకప్పటిలా నటీనటుల పై ప్రత్యేక ప్రేమ చూపించడం లేదు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీలు, యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, స్టార్ డమ్, స్టార్స్ అంటే విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు స్క్రీన్ పై కనిపించే వారి పట్ల.. తెలియని ఆకర్షణ ఉండేది. కానీ ఇప్పుడు సామాన్య వ్యక్తులు కూడా స్క్రీన్ పై కనిపించేస్తున్నారు.

ఒకప్పుడు హీరో కావాలి అంటే… జీవితం త్యాగం చేసి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ముప్పై లక్షలు ఉన్నవారు కూడా సరదాగా సినిమా చేసేస్తున్నారు. ఐ ఫోన్ లాంటి అధునాతన కెమెరాలు అందుబాటులోకి వచ్చాక… ఎవరికీ వారు తమకున్న స్క్రీన్ పై మోజును తనవితీరా తీర్చుకుంటున్నారు. నిజానికి 7, 8 ఏళ్ల కిందట ఒక నటుడికి గాని, నటికి గాని స్టార్ డమ్ వచ్చింది అంటే.. ఇక వాళ్ళు వీఐపీ అయిపోయినట్టే.
కానీ ఇప్పుడు ఊర్లో కూలికి పోయేవాడు కూడా యూట్యూబ్ లో వీడియోలు తీసి పెడుతున్నాడు. వారికి కూడా జనంలో గుర్తింపు వస్తోంది. మొత్తానికి ఇప్పటి పరిస్థితులు గతంలో కంటే పూర్తి భిన్నంగా మారిపోయాయి. దాంతో హీరోలకు ఒక భయం పట్టుకుంది. తమను ఆరాధించే వారు ఇక భవిష్యత్తులో ఉండరా అని ఓ హీరో తెగ ఇదైపోతున్నాడట.
ఎందుకు ఏ హీరోకి లేని బాధ, ఆ హీరోకే ఎందుకు అంటే.. అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే.. ఒకప్పుడు ఎక్కువ లైక్స్ అండ్ షేర్ వచ్చేవి. ఒక్కోసారి 70 వేలు, లక్ష లైక్స్ కూడా వచ్చేవి. కానీ.. ఈ మధ్య ఆ సూపర్ స్టార్ పోస్ట్ లకు లైక్స్ అండ్ కామెంట్స్ రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. మరోపక్క ముక్కు మొహం లేని వాళ్ళ వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ 1లో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
అసలు సౌత్ లో సినిమా హీరోలకు అభిమానగణం ఎక్కువ. ఏళ్లుగా స్టార్స్ ను అభిమానిస్తుంటారు. కానీ ఈ ఓటీటీలు వచ్చాక, టెక్నాలజీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాక స్టార్స్ స్టార్ డమ్ మసకబారింది. ఇలాగే కంటిన్యూ అయితే, ఇక భవిష్యత్తులో స్టార్లు ఉండరు, నటులు మాత్రమే ఉంటారు.