Janmashtami 2024: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పౌరాణిక పాత్రలు చెయ్యాలంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు తర్వాతే ఎవరైనా. దేవుడు ఎలా ఉంటాడు అనేది తెలుగు ప్రేక్షకులకు చూపించింది ఆయనే. రాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, భీముడు, కర్ణుడు ఇలా ఒక్కటా రెండా, అన్నీ పౌరాణిక పాత్రలను పోషించి, తనకి తానే సాటి అని నిరూపించుకున్నాడు. ‘దాన వీర సూర కర్ణ’ చిత్రంలో శ్రీకృష్ణుడు, కర్ణుడు మరియు దుర్యోధనుడు పాత్రలు పోషించి ఆరోజుల్లో ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్టీఆర్ తర్వాత శ్రీకృష్ణుడి పాత్రని ఏ హీరో అయినా చెయ్యాలంటే అది పెద్ద సాహసమే. ఎందుకంటే ఆ పాత్రకి ఆయన తెచ్చిన వన్నె అలాంటిది, ఎంత బాగా చేసిన కూడా ఎన్టీఆర్ తో పోల్చి చూస్తారు. అలా పోల్చి చూస్తారు అని తెలిసినప్పటికీ కూడా ఆ పాత్ర చేసి మెప్పించిన హీరోల గురించి జన్మాష్టమి సందర్భంగా నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎన్టీఆర్ తర్వాత శ్రీకృష్ణుడి పాత్రలను పోషించి విజయం సాధించిన హీరో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ.
అప్పట్లో బాలయ్య ‘శ్రీ కృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ వంటి సినిమాలు చేసాడు. శ్రీకృష్ణార్జున విజయం చిత్రంలో బాలయ్య శ్రీకృష్ణుడి పాత్రతో పాటుగా, అర్జునుడి పాత్ర కూడా పోషించాడు. ఇందులో ప్రముఖ నటుడు శ్రీహరి దుర్యోధనుడి పాత్ర పోషించగా, కమెడియన్ ఏవీఎస్ ‘శకుని’ పాత్ర పోషించాడు. ఆరోజుల్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య బాబు ని సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన చిత్రం ‘పాండురంగడు’. ఈ సినిమాలో కూడా బాలయ్య బాబు శ్రీకృష్ణుడి పాత్ర పోషించాడు. ఇక బాలయ్య తర్వాత శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2015 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రం అప్పట్లో కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణ గా కనిపిస్తాడు. శ్రీకృష్ణుడి గెటప్ లో కేవలం క్లైమాక్స్ లో వెంకటేష్ కి చూపించే విశ్వరూపం సన్నివేశంలో మాత్రమే కనిపిస్తాడు.
ఎక్కువ నిడివి శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపించకపోయినా మోడరన్ గెటప్ లోనే కృష్ణుడిలోని లక్షణాలను, ఆయన హావభావాలను ఎంతో చక్కగా పలికించి శబాష్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఆయన తర్వాత నేటి తరంలో ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఆ పాత్రలో కనిపించలేదు. భవిష్యత్తులో రాజమౌళి మహాభారతం తెరకెక్కిస్తే అందులో శ్రీకృష్ణుడి పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి . గతంలో ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ‘కురుక్షేత్రం’ అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీసాడు. ఈ సినిమాలో శోభన్ బాబు కృష్ణుడి పాత్రలో కనిపించగా, సూపర్ స్టార్ కృష్ణ అర్జునుడి పాత్రలో, రెబల్ స్టార్ కృష్ణం రాజు కర్ణుడి పాత్రలో కనిపించారు. ‘దాన వీర సూర కర్ణ’ చిత్రానికి పోటీగా దిగిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.