Star Hero vs Producer: ‘నువ్వెంత.. నీ సినిమా ఎంత?’ అనే స్థాయిలో మీడియా ఎదురుగానే వారి మైక్ లు గర్జించాయి.. ఒక నిర్మాత ఇష్టానుసారంగా మాట్లాడడం.. దానికి మరో సినిమా హీరో పంచ్ లు ఇవ్వడం జరిగిపోయాయి.. ఆ వివాదం అక్కడితోనే ముగియలేదు. తాజాగా విడుదలవుతున్న వారి సినిమాల మధ్య ఈ ప్రతీకారం మొదలైంది. ముందుగా విడుదలైన సినిమా బలైంది.. ఆ టాలీవుడ్ గాసిప్ ఏంటో చూద్దాం..
ఒక సినిమా విడుదలవుతుందంటే ఆ కోలాహం వేరే లెవల్ లో ఉంటుంది.. సినిమా సక్సెస్ సాధిస్తే సంబరాలు మిన్నంటుతాయి. కానీ పరాజయం పాలైతే మాత్రం హీరోలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సినిమా ఇండస్ట్రీలో పోటీ అనేది సర్వసాధారణం. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు, సహజంగానే తమ సినిమా విజయం సాధించడానికి అవతలి సినిమా ప్లాప్ కావాలని మేకర్స్ కోరుకోవడం జరుగుతుంది. ఈ పోటీ వాతావరణం కొన్నిసార్లు వ్యక్తిగత వైరంగా కూడా మారుతుంది.
వెబ్సైట్లకు డబ్బులిచ్చి… నెగటివ్ ప్రచారం
ఇటీవల ఒక స్టార్ హీరోకి, స్టార్ ప్రొడ్యూసర్ కు మధ్య కొన్ని వివాదాలు నడిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్మాత యొక్క సినిమా తాజాగా విడుదలైన తరుణంలో, సదరు స్టార్ హీరో కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్, రివ్యూ రైటర్ల ద్వారా కొన్ని వెబ్సైట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆ సినిమాపై నెగటివ్ రివ్యూలు రాయిస్తున్నారనే సంచలన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
విభేదాలతో కృషిని దెబ్బతీయడం సరికాదు
నిజానికి, మనుషుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఒక సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెగటివ్ రివ్యూలు రాయించడం అనేది ఎంతమాత్రమూ సమంజసం కాదు. సినిమా అనేది కేవలం డబ్బుతో కూడిన వ్యవహారం మాత్రమే కాదు. నిర్మాత తన డబ్బును పెడితే, దర్శకుడు తన ప్రాణాన్ని, సంవత్సరాల కలను రంగరించి ఆ సినిమాను తెరకెక్కిస్తాడు. ఎంతో మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషి, శ్రమ ఈ ప్రాజెక్ట్‌లో ఇమిడి ఉంటుంది.
కొంతమంది వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత ద్వేషం లేదా కోపాన్ని తీర్చుకోవడం కోసం, ఇంతమంది కష్టం, శ్రమ, జీవితాన్ని పణంగా పెట్టి చేసిన సినిమాను తొక్కేయడానికి ప్రయత్నించడం అన్యాయం మరియు అనైతికం.
సామరస్యమే శ్రేయస్కరం
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరస్పర ద్వేషం..వ్యతిరేక ప్రచారం వల్ల సినిమా ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్తుంది అనే ప్రశ్న తలెత్తుతోంది.
సినీ మేధావుల అభిప్రాయం ప్రకారం.. “మనలో మనం గొడవలు పడడం వల్ల ఇతరులకే అవకాశం దొరుకుతుంది తప్ప, మనకేం లాభం ఉండదు. ఏవైనా ఇబ్బందులు, విభేదాలు ఉంటే, అందరూ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి. దానికి ఒకరి సినిమాలను మరొకరు తొక్కేయడం కరెక్ట్ కాదు. ఐక్యమత్యమే ఇండస్ట్రీకి శ్రేయస్కరం.”
సినిమాను కళాఖండంగా చూడాలి తప్ప, వ్యక్తిగత పగ తీర్చుకునే సాధనంగా మార్చకూడదు. ఈ రకమైన నెగటివ్ ప్రచారం ఇండస్ట్రీ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు.