Guntur Kaaram: “రాజమాణిక్యాన్ని” అలానే దింపినా.. కుర్చీ మడత పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు

వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు.. చాలామంది దీనిని మలయాళ సూపర్ హిట్ సినిమా రాజమాణిక్యంతో పోల్చారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడు గా నటించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 13, 2024 2:16 pm

Guntur Kaaram

Follow us on

Guntur Kaaram: ఎన్నో అంచనాలు.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల టికెట్ పెంపు నిర్ణయాలు.. త్రివిక్రమ్ దర్శకత్వం.. మహేష్ బాబు కథానాయకత్వం.. శ్రీలీల నృత్యం.. మీనాక్షి చౌదరి అభినయం.. తెర నిండా తెలుగు సినిమాకు సంబంధించిన నటీనట వర్గం.. ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు కారం సినిమాకు ఉన్న అనుకూలతలు అన్ని ఇన్ని కావు. కానీ ఏం ఉపయోగం.. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందన్నట్టు.. చిత్రం నిండా భారీగా తారాగణం ఉన్నప్పటికీ అసలు విషయం లేకపోవడంతో నెగెటివ్ సంపాదించుకుంది. యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించారు అనే టాక్ వినిపించినప్పటికీ.. అసలు కథ విషయంలోనే దర్శకుడు తప్పుదారిపట్టాడని చిత్రం చూస్తే తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు.. చాలామంది దీనిని మలయాళ సూపర్ హిట్ సినిమా రాజమాణిక్యంతో పోల్చారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడు గా నటించారు. 2015 లో విడుదలైన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో కూడా హీరో మమ్ముట్టిని చిన్నతనంలోనే అతడి తల్లి వదిలేసి వెళ్ళిపోతుంది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత తన తల్లిని వెతుక్కుంటూ మమ్ముట్టి సాగించే ప్రయాణమే రాజమాణిక్యం సినిమా ఇతివృత్తం. ఈ సినిమాకు సంబంధించి తల్లి, కొడుకు మధ్య బలమైన భావోద్వేగాలను దర్శకుడు రాసుకున్నాడు. మమ్ముట్టి ఎలాగూ సీనియర్ నటుడు కాబట్టి భావాలను అత్యంత సులభంగా పలికించాడు. ఫలితంగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. అయితే తెలుగులో ప్రస్తుతం అదే ఇతి వృత్తంతో గుంటూరు కారం విడుదలైనప్పటికీ.. కథ, కథనంలో లోపాలు ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. మహేష్ బాబు కెరియర్ లోనే ఒక నిరుత్సాహకరమైన సినిమాగా మిగిలిపోయే అవకాశం ఉందని సినిమా ట్రేడ్ పండితులు అంటున్నారు.

కొడుకును తల్లి వదిలి వేసే విధానాన్ని సినిమా ప్రారంభంలోనే చూపించిన త్రివిక్రమ్.. ఆ తల్లి లేకపోవడం వల్ల కొడుకు పడే బాధలను చూపించలేకపోయాడు. పైగా గుంటూరు నుంచి తెలంగాణకు రావడం, వచ్చి ఫైట్లు చేయడం, తన తల్లి తండ్రికి వార్నింగ్ ఇవ్వడంతోనే సినిమా ఫస్ట్ హాఫ్ ను మొత్తం త్రివిక్రమ్ నడిపించాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్లో బలమైన భావోద్వేగాలను నడిపించలేకపోయాడు. అందువల్లే సినిమా జనాలకు అంతగా నచ్చడం లేదని.. ఇలాంటి పూర్ కథ, కథనాన్ని త్రివిక్రమ్ చిత్రీకరిస్తాడని అనుకోలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. చివరికి ఆ యాజమాన్యం సినిమాను మక్కికి మక్కి దించినప్పటికీ సంక్రాంతి విజేతగా గుంటూరు కారం నిలిచేదని.. ఏ విషయంలోనూ ఇది త్రివిక్రమ్ సినిమా కాదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మహేష్ బాబు నటనపరంగా బాగున్నప్పటికీ.. కథలో బలం లేకపోతే అతడు మాత్రం ఏం చేయగలరని అంటున్నారు. 2018 సంక్రాంతికి అజ్ఞాతవాసి పేరుతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన త్రివిక్రమ్.. 2024లో అంతకు మించిన “90 ఎంఎం రాడ్ ” దించారని ప్రేక్షకులు వాపోతున్నారు. చిత్రాన్ని చూసి మడత పెట్టి త్రివిక్రమ్ మీదకు వెళ్లాలి అనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు.