Sonu Sood: అరుంధతి సినిమాలో అమ్మ బొమ్మాలి అంటూ గుర్తింపు పొందారు సోనుసూద్. విభిన్నమైన పాత్రలో విలన్ క్యారెక్టర్‌ను పోషించారు. కరోనా సమయంలో రియల్ హీరో అంటూ ప్రజల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు హీరో సోనుసూద్. సోనుసూద్ చేసిన సేవ బహుశా ఏ స్టార్ హీరో చేసి ఉండరనే చెప్పాలి. గత రెండేళ్లుగా ప్రజలకు ఆయన చేసిన సేవ చాలా విలువైనది. ఎటువంటి పరిస్థితిలో నైనా తనకు చేతనైన సహాయం చేయగలిగారు సోనుసూద్.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. పుట్టిన బాబుకు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడడంతో ఆ దంపతులు ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. బాబుకు ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారు. చిన్నారి తండ్రి కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడం… వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి ఆ దంపతులిద్దరిది.
సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు విషయం తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలుపగా దీనిపైన వెంటనే స్పందించారు. ఆ దంపతులిద్దరిని ముంబై రప్పించుకున్నారు. ముంబై లోని వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్ చేయగా… ఆపరేషన్ సక్సెస్ అయింది. చిన్నారి ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్‌కి కృష్ణ దంపతులు రుణపడి ఉంటాము అని అన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.